బ్రిటన్ ప్రధాని ఎన్నికల రిజల్ట్ వెల్లడయ్యాక జరిగేది ఇదే

Update: 2022-09-05 09:30 GMT
కొన్ని నెలలుగా సా..గుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికల ప్రక్రియ మరికాసేపట్లో ముగియనుంది. ఇప్పటివరకు బయటకు వచ్చిన అంచనాల ప్రకారం బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ గెలుస్తుందని.. దీంతో బ్రిటన్ కు మూడోసారి ఒక మహిళ ప్రధాని కానుందని చెప్పక తప్పదు. అద్భుతం జరిగితే తప్పించి.. రిషి సునాక్ ప్రధాని ఎన్నికల్లో గెలిచే వీల్లేదని చెప్పాలి.  ఎన్నికల ఫలితం వెల్లడయ్యాక ఏం జరుగుతుంది? కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టటానికి ఉండే ప్రక్రియ ఏమిటి? ప్రస్తుతం పదవిలో ఉన్న బోరిస్ జాన్సన్ తన పదవికి ఎప్పుడు? ఎలా? రాజీనామా చేస్తారు? లాంటి ప్రశ్నలెన్నో. అదెలానో చూస్తే..

భారత కాలమానంతో చూసినప్పుడు బ్రిటన్ సమయం నాలుగున్నర గంటల వెనుక ఉంటారు. ఉదాహరణకు మనకు మధ్యాహ్నం ఒంటి గంట అయితే.. వారికి ఉదయం 8.30 గంటలు అవుతుంది. ఈ లెక్కన బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికల ఫలితం వారికి అక్కడ 12.30 గంటల వేళలో విడుదల కానుంది. అంటే.. మన టైం ప్రకారం చూసినప్పుడు సాయంత్రం 5 గంటలకు విడుదల అవుతుందన్న మాట.

బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్ గ్రాహం బాడీ ఎన్నికల ఫలితాన్ని విడుదల చేస్తారు. అయితే.. ఎన్నికల్లో విజయం సాధించి తదుపరి ప్రధాని పదవిని చేపట్టే వారు ఎవరు అన్న వషయాన్ని డౌనింగ్ స్ట్రీట్ కు సమీపంలో ఉన్న రాణి ఎలిజబెత్ 2 కాన్ఫరెన్స సెంటర్ నుంచి ప్రకటన చేస్తారు. ఇది చాలా సంక్షిప్తంగా ఉంటుంది. తాజాగా ఆవిడ డౌనింగ్ స్ట్రీట్ లో లేని కారణంగా.. ఆమె ఉన్న ప్రాంతం (స్కాట్లాండ్) నుంచి ప్రకటన వెలువడనుంది.  

ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరిస్తున్న బోరిస్ జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. ఈ కార్యక్రమం మంగళవారం జరగనుంది. అనంతరం ఆయన స్కాట్లాండ్ లోని రాణి ఎలిజబెత్ కు తన రాజీనామాను అందజేస్తారు. అదేసమయంలో ఎన్నికల్లో ప్రధానమంత్రిగా ఎంపికైన వారు స్కాట్లాండ్ కు వెళ్లి.. రాణి నుంచి నియామక పత్రాన్ని అందుకుంటారు. ఇక్కడో ఆసక్తికర విషయాల్ని వెల్లడించాలి.

బ్రిటన్ చరిత్రలో తొలిసారి ఇంగ్లండ్ లోని బకింగ్ హోమ్ ప్యాలెస్ కు బదులుగా మరో చోటు నుంచి దేశ ప్రధాని పేరును రాణి ప్రతిపాదించటం ఇదే తొలిసారి. ప్రస్తుతం క్వీన్ ఎలిజిబెత్ వయసు 96 ఏళ్లు. ఇంత వయసులో వీలైనంత తక్కువ ప్రయాణాల్నిచేసేలా ఆమె షెడ్యూల్ ఉంటోంది. అందుకే.. ఆమె ఉన్న చోటు నుంచే తదుపరి ప్రధాని ప్రకటన వెలువడనుంది.

కొత్తగా ప్రధానమంత్రిగా నియమితులైన వారు డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి తొలి ప్రసంగాన్ని చేసేందుకు ముందే కీలకమైన కేబినెట్ పదవుల్ని ఖరారు చేస్తారు. అదే సమయంలో సీనియర్ అధికారులు నూతన ప్రధానికి భద్రతకు సంబంధించిన కీలక వివరాలు.. అణ్వాయుధాల రహస్య కోడ్ లను అందజేస్తారు. బుధవారం మధ్యాహ్నం అధికార కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేత హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రతిపక్ష నేత ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం ఫలితం విడుదల అయిన నాటి నుంచి బుధవారం వరకు జరిగే వరుస కార్యక్రమాలతో ప్రధానమంత్రి పదవిని చేపట్టే ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News