టీ కాంగ్రెస్‌ లో ఏం జ‌రుగుతోంది... ఎక్క‌డో తేడా కొడుతోంది...!

Update: 2022-04-30 03:14 GMT
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా కాంగ్రెస్ లో గ్రూపు త‌గాదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్‌, సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు జిల్లాలో కాక రేపింది. ఈ గ్రూపు రాజ‌కీయాల వ‌ల్లే పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాది అవుతున్నా ఇంత వ‌ర‌కు అధికారికంగా జిల్లాలో అడుగుపెట్టలేకపోయారు రేవంత్‌. వ‌చ్చే నెల‌లో వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ స‌భ పేరుతో న‌ల్ల‌గొండ జిల్లాలో స‌న్నాహ‌క స‌మావేశం కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. దీన్ని సీనియ‌ర్లు అడ్డుకోవ‌డంతో గొడ‌వ ముదిరి పాకాన ప‌డింది. దీంతో రేవంత్ త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్నారు.

జిల్లా సీనియ‌ర్లు ముఖ్యంగా కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రేవంత్ రాక‌ను వ్య‌తిరేకిస్తున్నారు. రేవంతు జిల్లాకు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని.. రాహుల్ స‌భ‌కు జ‌న స‌మీక‌ర‌ణాన్ని తామే చూసుకుంటామ‌ని తేల్చి చెబుతున్నారు. దీంతో రేవంత్ వ‌ర్గం, పార్టీ ద్వితీయ శ్రేణి నేత‌లు భ‌గ్గుమ‌న్నారు.  రేవంత్ జిల్లాకు రావాల్సిందేన‌ని.. లేదంటే తామే ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో జిల్లా కాంగ్రెస్ లో ఆధిప‌త్య పోరు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చిన‌ట్లైంది.

జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నేత‌లు, సీనియ‌ర్ల ఆధిప‌త్యాన్ని వ్య‌తిరేకిస్తూ అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న వారు, రేవంత్ వ‌ర్గం ఈ సంఘ‌ట‌న‌తో ఏకమ‌య్యారు. వీళ్లంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌కంగా ఉన్న పార్టీ సీనియ‌ర్ నేత అద్దంకి ద‌యాక‌ర్ సీనియ‌ర్ల‌పై ఒంటికాలిపై లేచారు. తాను తుంగ‌తుర్తిలో రెండు సార్లు ఓడిపోవ‌డానికి కార‌ణం కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ అని.. వ్య‌తిరేక వ‌ర్గానికి మ‌ద్ద‌తిచ్చి త‌న‌ను ఓడించార‌ని ఆరోపిస్తున్నారు.

అదీ కాకుండా.. న‌ల్ల‌గొండ కాంగ్రెస్ బానిస‌త్వ రాజ‌కీయాల‌కు వేదికైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఒక్కో నాయ‌కుడు మూడు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌ను త‌మ అదుపులో ఉంచుకొని ఇష్టానుసారం రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

వారు నిల‌బ‌డ‌మంటే నిల‌బ‌డాలి.. కూర్చోమంటే కూర్చోవాలి.. అనే విధంగా జిల్లా రాజ‌కీయాల‌ను శాసిస్తున్నార‌ని అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఏఐసీసీ, పీసీసీ ప‌ద‌వుల్లో ఉన్న వారిని వ్య‌తిరేకిస్తూ జిల్లాను త‌మ గుప్పిట్లో ఉంచుకోవాల‌ని భావిస్తున్నార‌ని అన్నారు. రేవంత్ వ‌స్తే ఎక్క‌డ త‌మ పునాదులు క‌దులుతాయోన‌ని సీనియ‌ర్లు అడ్డ‌కుంటున్నార‌ని ఆరోపిస్తున్నారు.

అలాగే.. కుటుంబంలో ఇద్ద‌రు ముగ్గురికి టికెట్లు ఇప్పించుకుంటున్నార‌ని.. ఇది మంచి సంప్ర‌దాయం కాద‌ని.. ఒక‌రికే టికెట్ ఇవ్వాల‌ని.. అదికూడా నేత‌లు సూచించిన వారికి కాకుండా, కార్య‌క‌ర్త‌లు నిర్ణ‌యించిన వారికి టికెట్లు కేటాయించాల‌ని అధిష్ఠానానికి సూచించారు. దీంతో పీసీసీ నాయ‌క‌త్వం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. వీరంద‌రినీ స‌మన్వ‌యం చేసే బాధ్య‌త‌లు పార్టీ దిగ్గజం జానారెడ్డికి ఇచ్చింది. సీనియ‌ర్లు, అసంతృప్తుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి రేవంత్ ప‌ర్య‌ట‌న తేదీని ఖ‌రారు చేయాల‌ని సూచించింది. ఇక జానారెడ్డి ఏం చేస్తారో చూడాలి మ‌రి..!
Tags:    

Similar News