ఎంపీ అవినాశ్ కు రెండోసారి ఇచ్చిన నోటీసుల్లో ఏముంది?

Update: 2023-01-27 10:00 GMT
సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ వేగాన్ని పెంచింది. హత్య జరిగిన ఇన్నాళ్లకు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సీబీఐ.. ఆయన ఇచ్చిన సమాధానానికి బదులుగా మరోసారి నోటీసులు ఇవ్వటం తెలిసిందే. తొలిసారి నోటీసుల్లో ఈ నెల 23న తమ ముందుకు హాజరుకావాలని కోరుతూ నోటీసులు ఇవ్వటం.. తాను బిజీగా ఉన్నానని.. ముందుగా చేసుకున్న షెడ్యూల్ నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని చెప్పటం తెలిసిందే.

దీనికి బదులుగా మరోసారి స్పందించిన సీబీఐ.. అవినాశ్ కోరుకున్నట్లుగా ఐదు రోజుల గడువును ఇస్తూ.. జనవరి 28న అంటే శనివారం ఉదయం పదకొండు గంటలకు తమ కార్యాలయానికి రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది.

వివేకా హత్య జరిగి నాలుగేళ్లు అయినా.. కేసు దర్యాప్తు సరైన రీతిలో ముందుకు సాగకపోవటంపై వివేకా కుమార్తె మాత్రమే కాదు.. వైఎస్ షర్మిల సైతం అసంతృప్తిని వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇంతకాలం ఎంపీ అవినాశ్ కు నోటీసులు ఇచ్చే విషయంలోనూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిన సీబీఐ.. తాజాగా మాత్రం వేగాన్ని ప్రదర్శించటం చర్చగా మారింది.

ఇదిలా ఉంటే.. సీబీఐ నోటీసులపై స్పందించిన ఎంపీ అవినాశ్ మీడియా ఎదుట మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ రావాలంటే ఎలా? అని ప్రశ్నించటంతో  పాటు.. నాలుగైదు రోజుల్లో సీబీఐ విచారణకు హాజరవుతానని.. న్యాయం గెలవాలన్న మాట ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. తానేమిటో.. తన వ్యవహారశైలి ఏమిటో జిల్లా ప్రజలకుతెలుసని.. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని పేర్కన్నారు.

సీబీఐ స్పీడ్ వెనకున్న కారణం సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలుగా చెప్పాలి. ఈ హత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ కు బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసినట్లుగా చెబుతున్నారు.

రెండోసారి సీబీఐ నోటీసులు ఇచ్చిన తీరుచూస్తే.. అవినాశ్ విషయంలో గతానికి భిన్నంగా మరింత వేగంగా రియాక్టు కావటం ఖాయమన్న మాట వినిపిస్తుండగా.. సీబీఐ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో జనవరి 28న విచారణకు హాజరు కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News