విశాఖలో జగన్ ఏం చేయబోతున్నారంటే... ?

Update: 2021-10-19 07:35 GMT
జగన్ కి విశాఖకూ మధ్య విడదీయని తీయని బంధం ఉంది. జగన్ 2014 ఎన్నికల నుంచి కూడా విశాఖను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నాడు వైసీపీ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం, ప్రత్యర్ధుల ఎత్తులను ఊహించకపోవడం వల్ల జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దాంతో కసి మీద ఉన్న జగన్ 2019 నాటికి మొత్తం పరిస్థితిలో పూర్తి మార్పు తీసుకువచ్చారు. ఈ రోజు విశాఖలో వైసీపీ పొలిటికల్ గా బాగా స్ట్రాంగ్ గా ఉంది. విశాఖ మేయర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తో పాటు, వార్డు లెవెల్ నుంచి అన్ని సీట్లూ వైసీపీ సొంతం అయ్యాయి. విశాఖను రాజధాని చేస్తాను అని జగన్ చెప్పిన మాట మేరకు అసెంబ్లీలో చట్టం చేశారు. అదిపుడు కోర్టులో విచారణ దశలో ఉంది. అయినా విశాఖ ఏదో రోజు రాజధాని అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.

ఈ నేపధ్యంలో జగన్ విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి ఇక్కడ నుంచే పాలిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్య ఆ జోరు కాస్తా తగ్గింది. జగన్ కూడా విశాఖ టూర్లకు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆయన విశాఖకు ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం వచ్చారు. ఆ తరువాత చాన్నాళ్ళకు జగన్ మరో మారు విశాఖ వస్తున్నారు. ఈ నెల 23న జగన్ విశాఖ టూర్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ రోజున జగన్ సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అదే సమయంలో ఆయన విశాఖలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు.

జగన్ విశాఖ రాక పట్ల అటు వైసీపీ వర్గాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. జగన్ విశాఖ టూర్ ని సక్సెస్ చేయడానికి క్యాడర్ కసరత్తు మొదలెట్టేసింది. ఇదిలా ఉంటే జగన్ విశాఖ పర్యటన సందర్భంగా సంచలన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆయన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో భాగంగా విశాఖ రాజధాని గురించి ఏమైనా హింట్ ఇస్తారా అన్న దాని మీద ఆసక్తి నెలకొంది. ఒక వేళ రాజధాని విషయం మాట్లాడకపోయినా క్యాంప్ ఆఫీస్ గురించి అయినా సీఎం మనసులో మాట ఏమైనా చెబుతారా అన్నది కూడా అటు క్యాడర్ తో పాటు ఇటు ప్రజనీకం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశంగా ఉంది.

విశాఖ సహా ఉత్తరాంధ్రా అభివృద్ధికి వైసీపీ సర్కార్ కట్టుబడి ఉందని ఇప్పటికే మంత్రులు పలుమార్లు ప్రకటించారు. జగన్ తొందరలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ ప్రగతి గురించి జగన్ ఏం చెబుతారా అన్నదే ఉత్కంఠను రేకెత్తించే అంశంగా ఉంది. ఒక వైపు టీడీపీ అగ్ర నేతల వరస టూర్ల నేపధ్యం, విశాఖ అభివృద్ధికి నోచుకోలేదని, వైసీపీ సర్కార్ మీద విమర్శలు ఎక్కుపెడుతున్న క్రమంలో జగన్ వారికి జవాబుగా ఏదైనా ప్రకటన చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి జగన్ విశాఖ టూర్లో ఏ సంచలనాలు నమోదు అవుతాయో.
Tags:    

Similar News