ఏపీ లో ఈ మూడు పార్టీలకు అంత భయమేంటి?

Update: 2023-03-27 23:00 GMT
కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ లోక్‌ సభ సభ్యత్వాన్ని లోక్‌ సభ సెక్రటేరియట్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. గౌతమ్‌ అదానీ వ్యవహారంపై ప్రశ్నిస్తున్నందుకే తనపై అనర్హత వేటు వేశారని రాహుల్‌ సంచలన విమర్శలు చేశారు. అదానీ గురించి తాను అడిగినప్పుడల్లా ప్రధాని మోడీ కళ్లల్లో తాను భయాన్ని చూశానన్నారు. తాను లోక్‌సభలో మరోసారి ప్రసంగి స్తే ఇంకెన్ని నిజాలు బయటపెడుతానేమో అని మోడీ ఆందోళన చెందారని ఎద్దేవా చేశారు. అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని మండిపడ్డారు. తన పై అనర్హత వేటుతో తాను భయపడబోనని.. ప్రజాక్షేత్రంలోనే పోరాడుతూనే ఉంటానని హెచ్చరించారు.

తనను జైల్లో పెట్టినా.. ప్రధాని ప్రశ్నలు వేస్తూనే ఉంటానని రాహుల్‌ గాంధీ తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మన దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని తాను ఇప్పటి కే చాలాసార్లు చెప్పానని రాహుల్‌ గాంధీ గుర్తు చేశారు. అందుకు ఉదాహరణలే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని రాహుల్‌ తెలిపారు.

రాహుల్‌ గాంధీని అనర్హుడి గా ప్రకటించడం పై దేశంలో దాదాపు అన్ని ప్రతిపక్షాలు ఆయనకు సంఘీభావం ప్రకటించాయి.  కాంగ్రెస్‌ పార్టీ మార్చి 26న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాహుల్‌ గాంధీకి మద్దతుగా సత్యాగ్రహాలు నిర్వహించింది.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఆ పార్టీ మిత్ర పక్షాలుగా ఉన్న డీఎంకే, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్‌ థాకరే), జార్ఖండ్‌ ముక్తి మోర్చా, జేడీయూ వంటివి ఆందోళనలకు, నిరసనలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వీటి కి బీఆర్‌ఎస్, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ, సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌ వాదీ వంటి పార్టీలన్నీ జతకూడనున్నాయి. దీంతో దేశ రాజకీయం ఒక్కసారిగా మలుపుతిరిగింది.

అయితే విచిత్రంగా ఆంధ్రప్రదేశ్‌ లో అధికార, ప్రతిపక్షాలు రాహుల్‌ గాంధీ కి బాసటగా నిలవకపోవడం గమనార్హం. అధికార వైసీపీ మొదటి నుంచి బీజేపీ కూటమిలో చేరకపోయినా ఆ కూటమిలో ని పార్టీలకంటే బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తూ వస్తోంది.

ఇక టీడీపీ అయితే బీజేపీతో మరోమారు పొత్తుకు ప్రయత్నిస్తోంది. 2014లో మాదిరిగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని భావిస్తోంది. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తమతో కలసి వస్తుందని దింపుడు కళ్లెం ఆశతో టీడీపీ ఉంది.

మరోవైపు జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీతో మితృత్వాన్ని కొనసాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. బీజేపీ పై నర్మగర్భంగా పవన్‌ విమర్శలు చేస్తున్నా ఆ పార్టీ మాత్రం పవన్‌ పైన ఆశలు వదులుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో బీజేపీ తో సన్నిహితంగా వ్యవహరిస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేన.. రాహుల్‌ గాంధీ వ్యవహారంలో స్పందించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్‌ గాంధీ కి సూరత్‌ కోర్టు శిక్ష వేసినా.. ఆయనకు అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయినా ఆయనకు అవకాశం ఇవ్వకుండా లోక్‌ సభ సెక్రటేరియట్‌ పదవి నుంచి తప్పించడం అన్యాయమనే భావనే అన్ని పార్టీలతోపాటు ప్రజల్లోనూ వ్యాపించిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం విచిత్రంగా అధికార, ప్రతిపక్షాలు బీజేపీని ఒక్క మాట అనడానికి కూడా భయపడుతున్నాయని.. అందుకే రాహుల్‌ వ్యవహారంలో స్పందించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News