ఇపుడు విచారణ వల్ల ఏమిటి ఉపయోగం ?

Update: 2022-04-09 14:30 GMT
ఏపీ పునర్విభజన పిటీషన్ పై విచారణ జరిపేందుకు సుప్రింకోర్టు డిసైడ్ చేసింది. విచారణ నిమ్మితం తొందరలోనే ఒక తేదీని ప్రకటించనున్నట్లు చెప్పింది. 2014లో  ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. విభజన శాస్త్రీయంగా జరగలేదని, పార్లమెంటులో కూడా నిబంధనలను పాటించలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లోనే సుప్రింకోర్టులో కేసువేశారు. అయితే అప్పట్లోనే ఆయన వేసిన కేసును సుప్రింకోర్టు పట్టించుకోలేదు.

 ఉండవల్లితో పాటు మరో వందమంది వేసిన కేసుపై మాట్లాడుతు విభజన జరగకముందే కేసు వేస్తే ఏమిటి ఉపయోగమని నిలదీసింది. సరే విభజన ప్రక్రియ మొదలైన తర్వాత కేసును విచారించమంటే ప్రక్రియ మధ్యలో ఉండగా తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. విభజన పూర్తయింది కాబట్టి కేసును విచారించమంటే విభజన జరిగిపోయిన తర్వాత విచారణ జరిపి ఏమిటి ఉపయోగమని ప్రశ్నించింది. అప్పట్లోనే సుప్రింకోర్టు మూడు రకాలుగా స్పందించింది.

 అలాంటిది విభజన జరిగి ఎనిమిదేళ్ళయిపోయింది. రెండు రాష్ట్రాల్లోను రెండు ఎన్నికలు జరిగాయి. తెలంగాణాలో టీఆర్ఎస్ కే రెండోసారి అవకాశం దక్కగా ఏపీలో మొదటి టర్మ్ చంద్రబాబునాయుడుకు రెండోసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కింది.

పార్లమెంటులో రాష్ట్ర విభజనకు నిబంధనలు పాటించలేదని అడ్డుగోలుగా విభజన జరిగిందని అందరికీ తెలుసు. సకాలంలో విభజన ప్రక్రియను అడ్డుకోని సుప్రింకోర్టు తొందరలో విచారణ చేపట్టబోతున్నట్లు ప్రకటించటించటమే ఆశ్చర్యంగా ఉంది.

 భవిష్యత్తులో విభజన జరిగితే అడ్డుగోలుగా విభజన చేయకుండా ఈ విచారణ ఉపయోగపడుతుందని పిటీషనర్లు చెబుతున్నారు. నిజంగా ఇది పూర్తిగా హాస్యాస్పదమనే చెప్పాలి. విభజన సమయంలో కేంద్రప్రభుత్వం, పార్లమెంటు శాస్త్రీయతను పాటించకపోతే ఎవరు ఏమీ చేయలేరు.

అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కలిసిపోయి విభజన చేస్తే అడ్డుగోలు విభజనలే జరుగుతాయనటానికి ఏపీ విభజనే ఉదాహరణ. కాబట్టి ఏదైనా రాష్ట్రాన్ని విభజన చేయాలంటే అందుకు ఏదో ఒక శాస్త్రీయ విధానాన్ని రూపొందించాలి. అప్పుడే అడ్డుగోలు విభజనకు అవకాశం, తర్వాత సుప్రింకోర్టులో విచారణ అవసరముండదు.
Tags:    

Similar News