పాక్ ప్ర‌ధానిని క‌ల‌వ‌టం ట్రంప్‌కు గ‌ర్వంగా ఉంద‌ట

Update: 2017-05-22 13:38 GMT
మూర్ఖుడిగా.. మొండోడిగా సుప‌రిచితుడైన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప‌రిచ‌యం చేయ‌టానికి ముందు  మాట‌లు మార్చేసేటోడన్న మ‌రో ప‌దాన్ని కూడా చేర్చాల్సిన టైం వ‌చ్చేసింది. మంచి కాని చెడు కానీ ఏదైనా విష‌యం మీద త‌న అభిప్రాయాన్ని చెప్పేస్తే.. దాని మీద ఫిక్స్ అయిన‌ట్లుగా క‌నిపించే ట్రంప్ కు సింగిల్ టంగ్ కాదు.. డ‌బుల్ టంగ్ ఉంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. నిన్న‌టికి నిన్న సౌదీఆరేబియాకు వెళ్లిన ట్రంప్‌.. అక్క‌డ మాట్లాడుతూ ఉగ్ర‌వాదం కార‌ణంగా ప్ర‌పంచంలోని ప్ర‌తి దేశం ప్ర‌భావిత‌మైంద‌ని పేర్కొంటూ.. భార‌త్ పేరును ప్ర‌స్తావించారు.

దీంతో.. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్సహించే పాకిస్థాన్ లాంటి దేశాల‌కు చెంప‌దెబ్బ‌గా ట్రంప్ మాట‌ను ప‌లువురు భావించారు. కానీ.. అలాంటిదేమీ లేద‌ని.. పాక్ మీద అంతులేని ప్రేమ‌ను ట్రంప్ ఒల‌క‌బోయ‌టం ఇప్పుడు కోట్లాది భార‌తీయుల‌కు కాలిపోయేలా చేస్తోంది.

త‌న తొలి విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అర‌బ్ ఇస్లామిక్ అమెరిక‌న్ స‌ద‌స్సులో పాల్గొన్న ట్రంప్‌.. ఇదే స‌మావేశానికి హాజ‌రైన పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ను క‌లిశారు. స‌ద‌స్సుకు ముందు ఈ ఇద్ద‌రు నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ష‌రీఫ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్ కం చెప్పిన ట్రంప్‌.. ఆయ‌న్ను క‌ల‌వ‌టం త‌న‌కు గ‌ర్వంగా.. సంతోషంగా ఉంద‌ని వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో పాక్ ప్ర‌ధాని కూడా ఇలానే భావిస్తున్నార‌ని తాను అనుకుంటున్న‌ట్లుగా పేర్కొన్నారు. భేటీ అనంత‌రం స‌ద‌స్సులో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ.. ఉగ్ర‌వాదంపై పోరాడాల‌ని పిలుపునిచ్చారు.

ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషించే సైతాన్ల‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ.. అలాంటి వారిని క‌ల‌వ‌టం గ‌ర్వంగా ఉంద‌ని వ్యాఖ్యానించే వారు.. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా పోరాడాల‌న్న పిలుపునివ్వ‌టంలో అర్థం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఓప‌క్క ఉగ్ర‌వాదంపై పాక్‌ను ప‌రోక్షంగా త‌ప్పు ప‌డుతున్న‌ట్లుగా మాట్లాడుతూనే.. మ‌రోవైపు షేక్ హ్యాండ్ లు ఇస్తూ.. క‌ల‌వ‌టం గ‌ర్వంగా ఉంద‌న్న మాట‌లు చెప్ప‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Tags:    

Similar News