ప్రశాంత్ కిషోర్ ఎక్కడ?!

Update: 2019-02-12 12:42 GMT
భారీ మొత్తంతో స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒప్పందం కుదిరిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. గత ఎన్నికల  సమయంలో మోడీ టీమ్ లో పని చేసిన ప్రశాంత్ కిషోర్ టీమ్ తో జగన్ కొన్నాళ్ల కిందట ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఎన్నికలను ఎదుర్కొనడానికి పీకే టీమ్ ను జగన్ తన సలహామండలిలో నియమించుకున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొదట్లో పీకే టీమ్ కొంత వరకూ హడావుడి చేసింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు పీకే ఊసే వినిపించడం లేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.

పీకే టీమ్ తో ఒప్పందం కొనసాగుతూ ఉన్నా.. ఆయన బిహార్ వెళ్లిపోయాడు. అక్కడ జేడీయూలో చేరిపోయాడు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన టీమ్ మాత్రం ఇక్కడ జగన్ కోసం పని చేస్తోందట. అయితే ప్రశాంత్ కిషోర్ అయినా, ఆయన టీమ్ అయినా ఇప్పటి వరకూ జగన్ కోసం చేసింది ఏమిటి? అనేది మాత్రం కొశ్చన్ మార్క్.

వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గినా.. అందులో క్రెడిట్ మాత్రం పైసా వాటా కూడా ప్రశాంత్ కిషోర్ కు చెందదు అనేది ఖాయంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకూ పీకే టీమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సరైన కాన్సెప్ట్ కూడా ఇవ్వలేదు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు అంటున్నారు. పీకే టీమ్ అమలు పరిచిన ప్రోగ్రామ్స్ ఏవీ అంత సక్సెస్ కాలేదు. పార్టీకి ఊపునూ ఇవ్వలేదు.

ఒకవైపు జగన్ కష్ట పడుతూ ఉన్నాడు. దాదాపు ఏడాదికి పైనే పాదయాత్రను చేపట్టాడు. ఆ తర్వాత కూడా విరామం ఏమీ తీసుకోకుండా ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమాలు, తటస్థులతో సమావేశాలు.. వంటి వాటితో జగన్ బిజీ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ప్రబలిన నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది.

గత ఎన్నికల్లో మోడీ విజయంలో పీకే పర్సెంటేజీ ఎంతో తెలీదు కానీ.. సౌతిండియాలో ప్రత్యేకించి తెలుగునాట ప్రశాంత్ కిషోర్ ఓటర్ల నాడిని పట్టింది మాత్రం ఏమీ లేదని స్పష్టం అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన సక్సెస్ ఫుల్ గా ఏ ప్రోగ్రామ్ నూ చేపట్టకపోవడంతో ఈ అభిప్రాయం ఏర్పడుతోంది. బూత్ కమిటీల ఏర్పాటులో కానీ, మీడియా మేనేజ్ మెంట్ విషయంలో కానీ, సోషల్ మీడియా మేనేజ్ మెంట్ కానీ.. ఏ విషయంలోనూ పీకే టీమ్ సక్సెస్ అయ్యింది లేదు. సోషల్ మీడియాలో జగన్ అభిమానులు స్వతహాగా యాక్టివ్ గా ఉండటంతో సరిపోయింది కానీ పీకే టీమ్ పొడిచింది ఏమీ లేదు. ఏ స్ట్రాటజీ విషయంలోనూ సక్సెస్ కాలేకపోయిన పీకే టీమ్ మెనిఫెస్టో విషయంలో కూడా పాత చింతకాయ పచ్చడి తరహాలో వ్యవహరిస్తే.. ఆయనను నమ్ముకుని ప్రయోజనం ఏమిటి? అని వైసీపీలోని కొంతమంది అంటున్నారు.
Tags:    

Similar News