ఆ ఎన‌ర్జిటిక్ వైసీపీ ఎమ్మెల్యేలో ఆ దూకుడు ఏమైంది ?

Update: 2021-07-13 23:30 GMT
గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం పేరు చెప్ప‌గానే.. ఇక్క‌డ ఎప్పుడూ ఎన‌ర్జిటిక్‌గా ఉండే ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి గుర్తుకు వ‌స్తారు. వ‌రుస‌గా విజ‌యం ద‌క్కించుకుంటున్న ఈయ‌న గ‌త చంద్ర‌బాబు పాల‌నా కాలంలో నిత్యం మీడియాతో ట‌చ్‌లో ఉండేవారు. ముఖ్యంగా రాజ‌ధాని భూములు, ఇక్క‌డి నిర్మాణాలు, ప్ర‌పంచ బ్యాంకు నుంచి అప్పు పొందే విష‌యం.. స‌దావర్తి భూముల గొడ‌వ త‌దిత‌రాల‌పై ఉద్య‌మాలు చేయ‌డం.. సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించ‌డం, కోర్టుల్లో కేసులు వేయ‌డం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి ప్ర‌జ‌లు.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. గ‌త ఐదేళ్ల‌లో ఉన్న దూకుడు ఈ రెండేళ్ల‌లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యంగా ఆయ‌న గ‌త కొద్ది నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా ప‌ర్య‌టించ‌డం లేదు. కొన్నాళ్లు క‌రోనాతో ఆయ‌న దూరంగా ఉన్నార‌ని భావించినా... త‌ర్వాత కూడా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించింది లేదు. దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ శ్రేణులే చ‌ర్చించు కుంటున్నాయి. ఒక‌టి.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తిరుగులేద‌ని ఆయ‌న ధీమాగా ఉండ‌డం ఒక కార‌ణంగా క‌నిపిస్తుండ‌గా.. రెండోది.. త‌న‌కు జ‌గ‌న్ ఇచ్చిన హామీ నెర‌వేర‌క‌పోవ‌డంతో ఒకింత కినుక వ‌హిస్తున్నార‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇక ఆయ‌న‌కు పేరుకు మాత్ర‌మే సీఆర్డీయే చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చినా దాని వ‌ల్ల త‌న‌కు ఏ మాత్రం ఉప‌యోగం లేద‌ని అప్పుడే వాపోయారు.

ఇక ఆళ్ల‌కు సామాజిక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి రాద‌ని వైసీపీ వాళ్లే చెప్పుకుంటున్నారు. ఈ చ‌ర్చ ఆళ్ల దాకా వ‌చ్చేసింది. ఇక రాజ‌ధాని మార్పు అంశంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌పై క‌నిపించ‌ని వ్య‌తిరేక‌త ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ మంగ‌ళ‌గిరి సీటులోనే ముందుగా ఓడుతుంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఆళ్ల గ్రాఫ్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌నే వాద‌న ఉంది. ఆయ‌న ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా.. రాజ‌ధాని భూముల విష‌యాన్ని మాట్లాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. కానీ, నియోజ‌క‌వ‌ర్గంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. తాడేప‌ల్లిలో రైలు ఓవ‌ర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్ర‌తిపాద‌న అలానే ఉండిపోయిం ద‌ని.. దీనిని ప‌ట్టించుకుంటాన‌ని.. చెప్పినా ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీచేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

అదేవిధంగా పాన‌కాల స్వామి ఆల‌యం వ‌ద్ద ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప్ర‌తిపాద‌న కూడా అలానే ఉండిపోయింది. ఇక‌, మంగ‌ళ‌గిరి అభివృద్ధికి కూడా ఎమ్మెల్యే చేసింది ఏమీ లేద‌ని చెబుతున్నారు. ఆయ‌న ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌క‌పోవ‌డాన్ని ఇక్క‌డి ప్ర‌జ‌లు తీవ్రంగానే భావిస్తున్నారు. దీంతో ఆళ్ల మౌనం.. మొత్తానికి ఎస‌రు పెడుతుంద‌ని.. అంటున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ ఆయ‌న్ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోని ప‌రిస్థితే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News