టీకా వేయించుకున్న డాక్టర్ ధనలక్ష్మీ ఇప్పుడెక్కడ?

Update: 2021-01-28 11:30 GMT
ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సామాన్యుల్లో కొత్త గుబులును రేపుతున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మూడు..నాలుగు ఘటనలు చోటు చేసుకోవటం కొత్త భయాన్ని రేపుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మరణించినట్లుగా చెబుతున్న వారికి సంబంధించిన పూర్తి వివరాలు.. వారి మరణాలకు కారణాల విషయంలో నెలకొన్న అస్పష్టత టీకాల మీద కొత్త భయాన్ని రేపుతున్నాయి.

వీటిని తుంచే ప్రయత్నాల్ని ప్రభుత్వ అధికారులు చేయకపోవటంతో కొత్త కన్ఫ్యూజన్ తో తల్లడిల్లుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో ఇద్దరు.. ఏపీలో మరో ఇద్దరు టీకా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన డెంటల్ డాక్టర్ ధనలక్ష్మీ (24) టీకా తీసుకున్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు.

దాదాపు ఏడునెలల క్రితం ఆమె ఒంగోలు జీజీహెచ్లో చేరారు. ఈ నెల 23న వ్యాక్సిన్ వేయించుకున్నారు. మూడు రోజుల అనంతరం జ్వరం రావటంతో ఆమె జీజీహెచ్ లోని ప్రత్యేక వార్డులో చేరారు. అనంతరం ఆమె బీపీ ఒక్కసారిగా డ్రాప్ అవుతున్న విషయాన్ని గుర్తించారు.

దీంతో.. ఆమె ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ దిగజారిపోవటంతో ఆమెను హుటాహుటిన అర్థరాత్రి 12.50 గంటల వేళలో అంబులెన్సులో చైన్నైకి తరలించారు. ఈ ఉదంతం వ్యాక్సిన్ వేయించుకునే వారిలో కొత్త భయాన్ని తీసుకొస్తుంది. అందరి విషయంలో కాకుండా కొందరి విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయంపై ప్రభుత్వం ప్రత్యేక ద్రష్టి పెట్టాలన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News