కేసీయార్ అయినా జగన్ అయినా...ముందస్తు అంటే బీజేపీ చేసేది అదే...?

Update: 2022-12-01 09:45 GMT
ముందస్తు ఎన్నికలు పెట్టుకుని మరో మారు అధికారంలోకి రావడం. ఇది నయా రాజకీయ ట్రెండ్ అయింది. ఈ విషయం ఎలా ఉంది అంటే ఒక పుస్తకంలో పది పాఠాలు ఉంటే ఆరు మాత్రమే చదివిన కుర్రాడు మిగిలినవి వల్లె వేయకుండా ఉన్న వాటితోనే నెట్టుకువచ్చేసి నూరు మార్కులూ తెచ్చేసుకోవడం అన్న మాట.

నిజానికి దీన్ని రాజకీయ అతి తెలివి అని అంటారు. దీని వల్ల నష్టం ఏముంది అని ఎవరైనా అనవచ్చు. చెప్పుకుంటే చాలా ఉంది. ఒక ప్రభుత్వాన్ని ప్రజలు అయిదేళ్ళ కాల పరిమితికి ఎన్నుకుంటారు. దాన్ని తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం తగ్గించే రైట్ ఎవరికీ లేదు. అది ఓటరు తీర్పుని భంగపరచడమే. అదే టైంలో తాము ఇచ్చిన తీర్పు మీద పాలన సవ్యంగా జరిగిందా లేదా అని చూడకుండా హడావుడిగా ఎన్నికలు తెచ్చి ఆ తడపాటు పొరపాటులో ఓట్లేయించుకోవడమ అంటే మభ్యపెట్టడమే.

దీనిని ఎవరూ సమర్ధించకూడదు. నిర్ణీత గడవు అసెంబ్లీకి అయినా పార్లమెంట్ కి అయినా ఉండాలి. ఆ విధంగా రాజ్యాంగ సవరణ తెచ్చినా మంచిదే అని మేధావులు అంటున్నారు. ముందస్తు ఎన్నికలు అంటే అన్నీ విజయాలు ఉండవు, ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం కేసీయార్ గెలిచారు. ఆరు నెలల ముందు ఎన్నికలను ఆయన జరిపేసుకుని దాని ఫలితాలను అనుభవించారు.

ఇపుడు మరోసారి ఆయన ముందస్తు అంటారని విపక్షాలు ఊహిస్తున్నాయి. దానికి కారణం ఈ మధ్యనే కేసీయార్ మునుగోడు ఉప ఎన్నిక గెలిచి ఉన్నారు. విపక్షాలు చూస్తే ఇంకా సర్దుకోలేదు. బీజేపీకి మొత్తం 119 సీట్లకూ క్యాండిడేట్లు లేవు. వారు ఫిరాయింపుల కోసం చూస్తున్నారు. అలా నేతలు కూడితే కమలానికి లాభం. కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ కధ ఇంకా సాగుతోంది. అక్కడ కూడా వ్యవహారం చక్కబడితే కాంగ్రెస్ లో క్లారిటీ వస్తుంది.

ఇలా అంతా గందరగోళంగా ఉన్న పరిస్థితుల నేపధ్యంలో ముందస్తు అంటే కేసీయార్ కి రాజకీయ లాభం మరోసారి కలుగుతుంది అని అందరి కంటే బీజేపీ ఎక్కువగా అంచనా కడుతోంది. అందుకే ఆ పార్టీ నేతలు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ముందస్తు అని మీరు అసెంబ్లీ రద్దు చేస్తే వచ్చేవి ఎన్నికలు కావు, రాష్ట్రపతి పాలన అని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రపతిపాలన అంటే గవర్నర్ తమిల్ సై చేతిలోకి మొత్తం పాలన వెళ్తుంది అన్న మాట.

అపుడు టీయారెస్ కూడా విపక్షం ప్లేస్ లోకి వస్తుంది. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితేనే తమకు లాభమని బీజేపీ భావిస్తోంది. వచ్చే ఏడాది మే లో ఎన్నికలు అంటూ కేసీయార్ సర్కార్ సిద్ధపడితే దాన్ని డిసెంబర్ వరకూ ఎలా కొనసాగించాలో బీజేపీకి, కేంద్ర పెద్దలకు తెలుసు అంటున్నారు. తనంతట తాను అధికారాన్ని కేసీయర్ వదులుకుంటే గవర్నర్ పాలనతో తామే తెలంగాణాలో ఇండైరెక్ట్ గా చలాయించవచ్చు అని బీజేపీ పక్కా ప్లాన్ వేస్తోంది అని అంటున్నారు.

ఇక వెనకటికి వెళ్తే 2018 టైం లో కేసీయార్ కి కేంద్రంలో సఖ్యత ఉంది. కాబట్టి ఆయన కోరుకున్న టైం లో ముందస్తు ఎన్నికలు తెచ్చుకుని రెండవసారి గెలిచారు. ఈసారి అలా జరగనిస్తామా అని కమలనాధులు కత్తులు నూరుతున్నారు. నిజంగా కనుక కేసీయార్ ముందస్తుకు వెళ్తే కచ్చితంగా అది మొదటినే మోసం అవుతుంది అని కూడా బీజేపీ వారి మాటలను బట్టి తెలుస్తోంది.

మరో వైపు చూస్తే  నీవు నీర్పిన విద్యయే కేసీయార్ అని ఏపీలో జగన్ కూడా ముందస్తు మంత్రం పఠిస్తారు అని అంటున్నారు. ఆయన సైతం వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. జగన్ వైపు చూసుకుంటే కేంద్రంతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు కాబట్టి ముందస్తుకు కేంద్ర పెద్దలు జై కొడతారు అని అంటున్నా కేసీయార్ కి ఒక నీతి, ఏపీలో జగన్ కి మరో నీతి ఉండదు కదా. అందువల్ల తెలంగాణాలో రాష్ట్రపతి పాలన పెట్టి ఏపీలో ముందస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కచ్చితంగా అది బీజేపీకి రెండు చోట్లా బెడిసికొట్టే వ్యవహారం అవుతుంది.

అందుకే కేసీయార్ విషయంలో గట్టిగా ఉండాలనుకుంటే జగన్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. అలా కనుక ఆలోచిస్తే బీజేపీకి కావాల్సింది ఇపుడు ఎవరు అసెంబ్లీని ముందుగా రద్దు చేసి అధికారం వదులుకుంటారో అని చూడడమే. అలా కనుక జరిగితే రాజ్ భవన్ నుంచే మొత్తం పాలన హ్యాపీగా జరిపించవచ్చు. అలా తాము కోరుకున్న టైం దాకా పగ్గాలను తమ చేతులలోకి తీసుకోవచ్చు. అంటే తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కోరుకుంటున్న అధికారాన్ని ముందస్తు పేరుతో ముందే అప్పగించడానికి కేసీయార్ అయినా జగన్ అయినా సిద్ధపడతారా అన్నదే ఇపుడు ఆలోచించాల్సిన విషయం అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News