పవన్ కళ్యాణ్ గురించి మందకృష్ణ కామెంట్ల వెనుక?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారినా కొందరు పోలీసుల తీరు మారలేదని, రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. హోం మంత్రి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహించాలని పేర్కొంటూ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు వెనుకాడబోనని పవన్ కామెంట్ చేశారు. అయితే, దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ ఆసక్తికరంగా స్పందించారు.
హోంమంత్రి బాధ్యతలు తాను చేపట్టాల్సి వస్తుందని పవన్ చేసిన కామెంట్లపై మందకృష్ణ మాదిగ స్పందిస్తూ హోంమంత్రి అనిత పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆమెను అవమానపరిచేలా ఉన్నాయని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి వర్గంలో మాట్లాడుకోవాలి కానీ ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అభ్యంతరం వ్యక్తం చేశారు. హోంమంత్రి దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు అని పేర్కొన్న మందకృష్ణ ఈ కామెంట్లను తాము మనసులో పెట్టుకుంటాం అని మందకృష్ణ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ దళితులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని కూడా మందకృష్ణ విమర్శించారు
రాష్ట్రంలోని శాంతి భద్రతల స్థితిగతులపై మాట్లాడుతూ హోంమంత్రిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతుండటమే కాకుండా ఇప్పుడు కులం రంగు సైతం పులుముకోవడం సంచలనంగా మారుతోంది. శాంతి భద్రతలు, హోంమంత్రి అనిత పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు సమర్థించే వారు అటు వ్యతిరేకించేవారు తమ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఏ విషయంలో అయినా దూకుడుగా స్పందించే మందకృష్ణ మాదిగ తాజాగా `మనసులో పెట్టుకుంటున్నాం` అని సరిపెట్టడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని చెప్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మందకృష్ణ సుదీర్ఘ, సన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రథసారథిగా ఆయన్ను గుర్తుంచుకొని మందకృష్ణ ఈ కామెంట్లతో సరిపెట్టారని అంటున్నారు.