ట్రంప్ ప‌ద‌వి ఊడ‌బీకేందుకు స్కెచ్ రెడీ?!

Update: 2017-05-21 04:44 GMT
సంచలన ప్రకటనలు - క‌ల‌కలం రేకెత్తించే నిర్ణయాలు - ఏకపక్ష ధోరణితో వివాదాస్పద నేతగా ప్రచారం పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై అభిశంసన తీర్మానం ప్రతిపాదించే అవకాశాలున్నాయని వార్త‌లు వెలువడుతున్నాయి. కేవ‌లం వార్త‌లే కాకుండా ఈ క్ర‌మంలో ఓ స‌మావేశం కూడా జ‌రిగింద‌ని చెప్తున్నారు. అమెరిక‌న్ మీడియా క‌థ‌నం ప్ర‌కారం ట్రంప్ అభిశంసనకు సంబంధించి ఇటీవల ఓ సమావేశం జరిగింది. ట్రంప్‌ ను ప‌ద‌వీ నుంచి దింపేందుకు ఏ విధంగా అవకాశముందో వివరంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇందులో పాల్గొన్న‌ ఓ అధికారి తెలిపారని మీడియా వెల్ల‌డించింది. అత్యంత ఆస‌క్తిక‌రంగా వైట్‌ హౌస్ కౌన్సెల్ ఆఫీస్ లాయర్లు కూడా అభిశంసన ప్రక్రియకు సంబంధించిన వివరాలను శోధిస్తున్నారు! ఈ విషయంలో వారు కొందరు నిపుణులను కూడా సంప్రదించారు. దీంతో ఈ పరిణామమే ట్రంప్ ప‌ద‌వి విష‌యంలో పలు ఊహాగానాలకు తావిస్తోంది.

అయితే వైట్‌ హౌస్ అధికారికంగా దీనిపై మాట్లాడలేదు. అధికారులు అభిశంసన ప్రక్రియ విధానాన్ని పరిశోధిస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనం నిజం కాదని పేర్కొంది. అధ్యక్షుడికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా చూసేందుకే ముందస్తుగా ఈ సమావేశం, చర్చలు కొనసాగినట్టు వైట్ హౌస్ వ‌ర్గాల సమాచారం. మ‌రోవైపు ట్రంప్ వ్యవహార సరళిపై ఎంతటి వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే అభిశంస‌న వంటి తీవ్ర చర్య అంత సులభసాధ్యమేమీ కాకపోవచ్చున‌ని నిపుణులు చెప్తున్నారు. కాంగ్రెస్‌ లో రిపబ్లికన్ మిత్రపక్షాలు కూడా అధ్యక్షుడికి మద్దతుగానే ఉన్నాయని వైట్‌ హౌస్ అధికారులు విశ్వసిస్తున్నారు. డెమొక్రాట్లు కూడా ఇంపీచ్‌ మెంట్ అంశాన్ని మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. అది తొందరపాటు ఆలోచనే అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలాఉంండ‌గా...అమెరికాలో ఇప్పటికి ముగ్గురు అధ్యక్షులకే అభిశంసన ప్రమాదం ఎదురైంది. ఆండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్‌లను తొలుత అభిశంసించి, తర్వాత వదిలేశారు. 1974లో అభిశంసన విచారణ ప్రారంభం కాకముందే రిచర్డ్ నిక్సన్ రాజీనామా చేశారు. ఈ జాబితాలో ట్రంప్ చేరుతారా లేదా అనేది కాల‌మే నిర్ణ‌యించాల్సి ఉంటుంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News