ఆర్టికల్ 370 రద్దు.. మోదీకి ఎవరు మద్దతిచ్చారు? ఎవరు వ్యతిరేకించారు?

Update: 2019-08-05 09:59 GMT
జమ్ముకశ్మీర్ ప్రత్యేక అధికారాలకు ముగింపు పలికేలా ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు చాలా పార్టీల నుంచి మద్దతు దొరుతకుతోంది. నిన్నమొన్న కూడా ఇతర బిల్లుల విషయంలో కేంద్రాన్ని వ్యతిరేకించిన పార్టీలు సైతం ఈ విషయంలో మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎవరు మద్దతిచ్చారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారో చూద్దాం.

రాజ్యసభలో జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు బిల్లులపై చర్చ జరుగుతోంది. వీటిని కాంగ్రెస్- జమ్ముకశ్మీర్‌ కు చెందిన పార్టీలు నేషనల్ కాన్ఫరెన్సు, పీడీపీలు వ్యతిరేకించాయి. ఈ రెండు పార్టీలతో పాటు తమిళనాడుకు చెందిన ఎండీఎంకే కూడా వ్యతిరేకించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ వైగో మాట్లాడుతూ.. ఈ ఆర్టికల్‌ ను రద్దు చేస్తే జమ్ముకశ్మీర్ మరో కొసావో- ఈస్ట్ తైమూర్‌- సౌత్ సూడాన్‌ లా మారుతుందని అన్నారు. ఈ నాలుగు పార్టీలే కాకుండా బీజేపీతో కలిసి బీహార్లో ప్రభుత్వం నడుపుతున్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ కూడా ఆర్టికల్ 370 రద్దు బిల్లును వ్యతిరేకిస్తోంది. సీపీఐ- సీపీఎం- కేరళ కాంగ్రెస్- సమాజ్ వాది పార్టీ- ఆర్జేడీ- ఆర్ ఎస్పీ- ముస్లిం లీగ్‌ లు వ్యతిరేకించాయి.

శివసేన- ఆప్- ఏజీపీ- వైసీపీ.. చాలా పార్టీల సపోర్టు

మోదీతో ఢీ అంటే ఢీ అనే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొనడానికి ఇది దోహదపడుతుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అస్సాం గణ పరిషత్- ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలో ఉన్న వైసీపీ కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి. ఇక బీజేపీ మిత్రపక్షం శివసేన అయితే సంబరాలు చేసుకుంటోంది. కేంద్రం చర్యను సమర్థించడమే కాకుండా త్వరలో పాక్ ఆక్రమిత కశ్మీర్- బలూచిస్తాన్‌ లను కూడా భారత్‌లో కలపడాన్ని ప్రధాని మోదీ సాధ్యం చేసి చూపిస్తారని... తమకు ఆ విశ్వాసం ఉందని ప్రకటించింది. ప్రస్తుత భారత్- పీఓకే- బలూచిస్తాన్- ఇతర ప్రాంతాలతో కలిపి అఖండ్ భారత్‌ ను మోదీ ఏర్పాటు చేస్తారన్న నమ్మకంతనకుందని రాజ్యసభలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

ఇక ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్, తమిళనాడులోని పాలక పార్టీ అన్నాడీఎంకే, ఉత్తర్ ప్రదేశ్‌ కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ కూడా కేంద్రానికి మద్దతు పలికాయి.


   

Tags:    

Similar News