ఎవ‌రు హిందువు..? మోడీ చుట్టూ మ‌రో వివాదం!

Update: 2022-12-31 03:47 GMT
బీజేపీ అంటేనే క‌ర‌డు గ‌ట్టిన హిందూత్వ సంస్థ ఆర్ ఎస్ ఎస్ నుంచి పుట్టిన‌పార్టీగా అంద‌రికీ తెలిసిందే. తొలుత జ‌న‌తా.. త‌ర్వాత జ‌న్ సంఘం.. త‌ర్వాత బీజేపీగా మారింది. మొత్తానికి ఇప్ప‌టికీ బీజేపీ నేత‌లు ఆర్ ఎస్ ఎస్ నుంచి రావ‌డాన్ని ప్రివిలేజ్‌గా భావిస్తుంటారు. పీఎం మోడీ కూడా త‌ర‌చుగా ఆర్ ఎస్ ఎస్ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటూనే ఉన్నారు. అంతేకాదు.. ఉమ్మ‌డి పౌర స్మృతి(కామ‌న్ సివిల్ కోడ్‌)ని అమితంగా ఇష్ట‌ప‌డే మోడీ ఇప్పుడు.. తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

మోడీని వ్య‌తిరేకించే ప‌లు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు.. ఆయ‌న‌ను ''ఎవ‌రు హిందువు?''  అని ప్ర‌శ్నిస్తున్నాయి. అయితే.. దీనికి స‌మాధానం చెప్ప‌లేక బీజేపీ స‌త‌మ‌తం అవుతోంది. దీనికి కార‌ణం.. మోడీ మాతృమూర్తి హీరాబెన్  అంత్యక్రియల అనంతరం ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయ‌న పాల్గొనడమే!!

దీనిపై యూపీకి చెందిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సమాజ్‌వాదీ పార్టీ నేత ఐపీ సింగ్ విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీపార్టీ నేత‌లు కూడా విమ‌ర్శించారు. సింగ్ ఏమ‌న్నారంటే.. ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరణించినపుడు ఏ విధంగా వ్యవహరించారో వివరించారు.  అఖిలేశ్ హిందూ ఆచార, సంప్రదాయాలన్నిటినీ గౌరవిస్తూ, 13వ రోజు వరకు అన్నిటినీ వదిలిపెట్టి, తన తండ్రి ఆత్మ శాంతి కోసం ప్రార్థించారని చెప్పారు.

అదేస‌మ‌యంలో ఈ దేశానికి కుమారుడిన‌ని చెప్పుకొనే మ‌రో కుమారుడు(మోడీ) హిందూ ఆచార, సంప్రదాయాలను తిరస్కరించి, తన తల్లి అంత్యక్రియల అనంతరం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. 'సూతక' సమయంలో శుభకార్యాల నిర్వహణపై నిషేధం ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. 'ఎవరు హిందువు?' అని ప్రశ్నించారు.

దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా  స్పందిస్తూ.. యావత్తు దేశానికి తల్లివంటి వ్యక్తిని కోల్పోయి, తామంతా బాధతో కుమిలిపోతున్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ ఆలోచనా విధానం బాగోలేద‌న్నారు.

మోడీ తన దుఃఖం, విచారం కన్నా కర్తవ్యానికే పెద్ద పీట వేసినందుకు, వ్యక్తిగత నష్టం కన్నా భారత మాతకు పెద్ద పీట వేసినందుకు ప్రశంసించడానికి బదులుగా సమాజ్‌వాదీ పార్టీ ఆయనపై విమర్శలు గుప్పిస్తోందన్నారు.

ఇదిలావుంటే, గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో హీరాబెన్ మోడీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. షెడ్యూలు ప్రకారం ఆయన పశ్చిమ బెంగాల్‌లో పర్యటించవలసి ఉంది. కానీ ఆయన మాతృమూర్తి కన్నుమూయడంతో ఆమె పార్దివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గాంధీ నగర్ వెళ్ళారు. అనంతరం వర్చువల్ గా ఢిల్లీ నుంచి ఈ రైలును ప్రారంభించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News