ఇంత‌కీ.. జ‌న‌సేన‌ను న‌డిపిస్తోందెవ‌రూ?

Update: 2021-07-22 09:33 GMT
ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటమే ల‌క్ష్యంగా రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసిన జ‌న‌సేన పార్టీ భ‌విత‌వ్యం ఏమిటీ? ఇప్పుడా పార్టీని న‌డిపిస్తోందంటూ ఎవ‌రు? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌శ్నించ‌డానికి వ‌స్తున్నాడంటూ 2014లో పార్టీ స్థాపించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. కానీ ఇటీవ‌ల ప‌రిస్థితులు చూస్తే పార్టీ అధినేత‌గా ఆయ‌న పాత్ర‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ ఛైర్మ‌న్‌గా ఉన్న మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తీరే అందుకు కార‌ణ‌మ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

2014 ఎన్నిక‌ల్లో ఇటు ఏపీలో టీడీపీకి, అటు కేంద్రంలో బీజేపీకి మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ నిలిచారు. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వ‌చ్చాయి. ఇక 2019 ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాల‌తో క‌లిసి పోటీ చేసిన జ‌న‌సేన కేవ‌లం ఒక్క సీటు మాత్ర‌మే ద‌క్కించుకోగ‌లిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ బీజేపీతో చేతులు క‌లిపారు. అయితే ప్ర‌స్తుతం తిరిగి సినిమాల్లో బీజీ అయిన ఆయ‌న‌.. పార్టీపై ప్ర‌త్యేక దృష్టి సారించ‌ట్లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో జ‌న‌సేన‌లో ఉన్న నాయ‌కుల్లో నాదెండ్ల మ‌నోహ‌ర్ ఒక్క‌రే కొంచెం బాధ్య‌త‌లు ఉన్న నాయ‌కుడు. అయితే గ‌త కొన్ని నెల‌లుగా ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌లేక‌పోతున్నార‌నే అభిప్రాయం ఉంది. క‌రోనా పేరుతో త‌ప్పించుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లూ ఉన్నాయి. ఏ పార్టీ అయినా తిరిగి పుంజుకుని అధికారంలోకి రావాల‌నుకుంటే ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల్సిన అవ‌స‌రం ఉంది. క‌రోనా ప‌రిస్థితుల్లోనూ డిజిటిట్ మాధ్య‌మాల ద్వారా టీడీపీ ఈ వ‌రుస‌లో ముందుంది. బీజేపీ ప‌రిస్థితి కూడా ఫ‌ర్వాలేదు. కానీ జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే మాత్రం గ‌త కొన్ని నెల‌లుగా సైలెంట్‌గా ఉంటుంది.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌తో తీరిక లేకుండా ఉన్నారు. ఏకంగా అయిదు సినిమాల‌ను లైన్లో పెట్టారు. దీంతో ఈ చిత్రాల‌న్నింటినీ పూర్తి చేసేలోగా 2024 ఎన్నిక‌లు వ‌చ్చేస్తాయి. అప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌సేన పార్టీ బాధ్య‌త నాదెండ్ల మ‌నోహ‌ర్ మీదే పెట్టారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ అటు సినిమాల్లో బిజీగా ఉంటే.. ఇటు నాదెండ్ల ఏం చేస్తున్నార‌నే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. ఇటీవ‌ల జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్ ప్ర‌క‌టించాల్సిన, చ‌ర్చించాల్సిన అంశాల‌ను ముందుగానే నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్ప‌డం ఇప్పుడీ చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం, జాబ్ క్యాలెండ‌ర్ వంటి కీల‌క అంశాల‌పై ముందుగా ప‌వ‌న్ మాట్లాడి ఆ త‌ర్వాత అజెండాను ప్ర‌క‌టించాల్సింది. కానీ ఇప్పుడు నాదెండ్ల మాత్రం ముందుగానే ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న పాత్ర‌పై అనుమానాలు వ‌స్తున్నాయి. పార్టీని న‌డిపిస్తుందా ప‌వ‌న్ క‌ల్యాణా? లేదా నాదెండ్ల మ‌నోహ‌రా? అనేది తేలాల్సి ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News