బీసీల భ‌రోసా!... జ‌గ‌నా?, చంద్ర‌బాబా?

Update: 2019-01-30 04:10 GMT
ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌... బీసీల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు దాదాపుగా అన్ని పార్టీలు త‌మ‌దైన వ్యూహాలు అమ‌లు చేస్తున్నాయ‌నే చెప్పాలి. ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల్లో అంద‌రికంటే ముందు ఉన్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... మొన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కేంద్రంగా *జ‌య‌హో బీసీ* పేరిట ఓ భారీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అప్ప‌టిదాకా బీసీల మాటే ఎత్త‌ని చంద్ర‌బాబు... జ‌య‌హో బీసీ స‌భ‌లో బీసీల‌కు వ‌రాల జ‌ల్లు కురిపించారు. బీసీల‌కు త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో ఎంత‌మేర నిధులు ఖ‌ర్చు పెట్టిన వైనాన్ని ఏక‌రువు పెట్టిన చంద్ర‌బాబు... రానున్న కాలంలో ఇంకెంత మేర నిధులు విడుద‌ల చేస్తాన‌న్న విష‌యాన్ని కూడా కాస్తంత ఘ‌నంగానే చెప్పుకున్నారు. ఈ స‌భ గ్రాండ్ స‌క్సెస్ అయ్యిందంటూ త‌న అనుకూల మీడియాలో డ‌బ్బాలు కొట్టించుకున్న బాబు... వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీసీల ఓట్లన్నీ టీడీపీకేన‌న్న క‌లరింగ్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో బీసీల‌కు భ‌రోసా క‌ల్పించే దిశ‌గా ఎవ‌రు ప‌క్కాగా అడుగులు వేస్తున్నార‌న్న విష‌యంపై ఇప్పుడు కాస్తంత లోతైన చ‌ర్చ‌కే తెర లేసింద‌నే చెప్పాలి.

అయినా బీసీలు ఏం కోరుకుంటున్నారు? ఏళ్ల త‌ర‌బ‌డి రాజ్యాధికారం దిశ‌గా బీసీలు వేస్తున్న అడుగుల‌కు ఏ పార్టీ మ‌ద్ద‌తు ప‌లుకుతోంది? అస‌లు బీసీల‌ను ఓటు బ్యాంకుగా కాకుండా వారి పురోభివృద్ధికి పాటు ప‌డుతున్న పార్టీఏది? అన్న విష‌యాలు చ‌ర్చించుకుంటే.. ఆస‌క్తిక‌ర అంశాలు మ‌న మ‌దిలో మెదిలే అవ‌కాశం ఉంది. ఈ దిశ‌గా బీసీల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నది టీడీపీనే అని చెబుతున్న చంద్ర‌బాబు.. ఇప్ప‌టిదాకా బీసీల‌కు ఆయ‌న ఏం చేశారు? భ‌విష్య‌త్తులో ఏం చేయ‌బోతున్నారు? అన్నదాన్ని ఓ సారి ప‌రిశీలిస్తే.. మెజారిటీ బీసీలు ఆది నుంచి టీడీపీతోనే సాగుతున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ బీసీల పార్టీనే అని గొప్ప‌లు చెప్పుకున్న చంద్ర‌బాబు... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన పార్టీ సీనియ‌ర్ నేత కేఈ కృష్ణ‌మూర్తికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇచ్చి... రెవెన్యూ శాఖ ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. అయితే ఆ శాఖ వ్య‌వ‌హారాల‌ను పూర్తిగా చంద్ర‌బాబు త‌న చేతిలోనే ఉంచుకున్నార‌ని, కేఈ మాత్రం నామ‌మాత్ర‌పు మంత్రేన‌ని ఇప్ప‌టికే చాలా సార్లు స్ప‌ష్ట‌మైంద‌నే చెప్పాలి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీసీల‌కు టీడీపీ ఎన్ని సీట్ల‌ను కేటాయిస్తుంద‌న్న అంశానికి వ‌స్తే... పెద్ద‌గా స్ప‌ష్ట‌త లేద‌నే చెప్పాలి.

గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేసి వైసీపీ చేతిలో ఓట‌మిపాలైన బీటీ నాయుడు... పార్టీలోని బీసీల్లో మంచి పేరున్న నేత‌గానే లెక్క‌. క‌ర్నూలులో మొద‌టి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న బీటీ నాయుడికి రాజ్య‌స‌భ సీటిస్తాన‌ని చంద్ర‌బాబు గ‌తంలో హామీ ఇచ్చారు. అయితే అందివ‌చ్చిన ఒకే ఒక్క సీటును బీటీ నాయుడికి ఇచ్చిన‌ట్టే ఇచ్చి... చివ‌రి నిమిషంలో టీజీ వెంక‌టేశ్ కు కేటాయించి బీసీల‌కు చేయిచ్చేశారు. ఇప్పుడు క‌ర్నూలు నుంచి ఎంపీగా ఉన్న బుట్టా రేణుక కూడా బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారే. గ‌డచిన ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన ఆమె విజ‌యం సాధించి... ఆ త‌ర్వాత బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష‌కు ప‌డిపోయి సైకిలెక్కేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు పార్ల‌మెంటు సీటు త‌న‌కేన‌ని కూడా చంద్ర‌బాబు చెప్పారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చేసి టీడీపీలో చేర‌నున్న సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డికి ఆ సీటును ఖ‌రారు చేసేశారు. దీంతో బీసీ వ‌ర్గానికి చెందిన బీటీ నాయుడితో పాటు బుట్టా రేణుక‌కు కూడా బాబు ఈ ఎన్నిక‌ల్లో రిక్త హ‌స్తమే ఇచ్చేశార‌ని చెప్పాలి.

ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విష‌యానికి వ‌స్తే... బీసీ సంక్షేమానికి సంబంధించి ఆది నుంచి స్ప‌ష్ట‌మైన వైఖ‌రితోనే ఆయ‌న ముందుకు వెళుతున్నార‌నే చెప్పాలి. క‌ర్నూలు పార్ల‌మెంటుతో పాటు అనంత‌పురం జిల్లా హిందూపురం, తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం లోక్ స‌భ సీట్ల‌ను కూడా బీసీల‌కే కేటాయిస్తున్న‌ట్లు చాలా కాలం క్రిత‌మే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆ దిశ‌గానే సాగుతున్న జ‌గ‌న్‌... రాజ‌మ‌హేంద్ర‌వ‌రం పార్ల‌మెంటు ఇంచార్జీగా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌కుడు మార్గాని భ‌ర‌త్ రామ్‌ ను నియ‌మించారు. ఇక క‌ర్నూలు ఇంచార్జీగా అదే వ‌ర్గానికి చెందిన బీవై రామ‌య్య‌ను కొన‌సాగిస్తున్నారు. హిందూపురం నుంచి కూడా వైసీపీ అభ్య‌ర్థిగా బీసీ నేతే బ‌రిలో ఉంటార‌ని క్లారిటీ ఇచ్చేశారు. ఇక బీసీల్లోని దాదాపుగా అన్ని వృత్తుల వారికి ఉప‌యుక్తంగా ఉండే ప‌లు అంశాల‌పై ఇప్ప‌టికే జ‌గ‌న్ చాలా స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చేసి ఉన్నారు. అంటే మొత్తంగా బీసీల‌కు భ‌రోసా క‌ల్పించేది జ‌గ‌న్ మాత్ర‌మేన‌ని, చంద్ర‌బాబు ఎంత‌మాత్రం కాద‌న్న కోణంలో ఇప్పుడు ఆసక్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.


Tags:    

Similar News