ఉండవల్లి జోస్యం : ఏపీలో 2024 లో గెలిచేది ఎవరంటే...?

Update: 2022-08-18 02:30 GMT
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఎవరు సీఎం అవుతారు. ఇదే అంతటా వాడి వేడి చర్చగా ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల టైమ్ ఉంది. అయినా సరే రాజకీయ వాతావరణం అయితే వచ్చేసింది. ఇదిలా ఉండగా మాజీ ఎంపీ, రాజకీయ మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక యూ ట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీ మీద జోస్యం చెప్పారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే దానికి లెక్కలు ఉన్నాయని అన్నారు.

కేంద్రంలో నరేంద్ర మోడీకి తెలంగాణా మీద ఉన్న ఆసక్తి ఏపీ మీద లేదని అన్నారు. ఏపీలో బీజేపీ ఎదిగేది కూడా పెద్దగా లేదని చెప్పారు. అందువల్ల ఏపీలో అయితే వైసీపీ లేకపోతే టీడీపీ ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీని మోడీ ఎంచుకుంటారు అని అన్నారు. మోడీకి జగన్ తో ఇలాగే బాగా ఉంది అనిపిస్తే జనసేనను బీజేపీతో కలిపి పోటీ చేయిస్తారని చెప్పారు. అపుడు ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ జరిగి వైసీపీ సులువుగా మరో మారు అధికారాన్ని అందుకుంటుందని అన్నారు.

అదే జగన్ని చూశాం కదా ఈసారి చంద్రబాబుతోనే అని మోడీ అనుకుంటే ఏపీలో మహా ఘటబంధన్ తయారవుతుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. అపుడు జగన్ యాంటీ కూటమి బలంగా మారి వైసీపీ విజయం సంక్లిష్టమైన పరిస్థితుల్లో పడుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఏపీలో ఈ రోజుకు చూస్తే జగన్ కి గ్రామసీమలలో ఆదరణ తగ్గలేదు కానీ అర్బన్ ఓటింగ్ బాగా దెబ్బతిందని, గ్రాఫ్ కూడా తగ్గిపోయిందని ఉండవల్లి అన్నారు.

అదే టైంలో గత ఎన్నికల్లో టీడీపీకి 40 శాతం ఓటింగ్ వచ్చిందని, ఈసారి అది పెరిగే అవకాశం ఉందని, ఇక జనసేనకు ఆరు శాతం ఓటింగ్ ఉందని, అది పన్నెండు శాతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని ఉండవల్లి అన్నారు. అపుడు పొత్తులు కనుక కుదిరితే కచ్చితంగా వైసీపీని ఓడించగలరని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

ఏపీలో చూస్తే వైసీపీ తనకు కచ్చితంగా 175 సీట్లలో విజయం తధ్యమని భావిస్తోందని, అలాగే టీడీపీ కూడా వందకు తగ్గకుండా సీట్లు గెలుస్తామని భావిస్తోందని, జనసేన‌తో పొత్తు ఉంటే మరిన్ని సీట్లు ఖాయమని కూడా భావిస్తోందని ఉండవల్లి పేర్కొన్నారు.

అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం గ్రామీణ ఓటర్లు వైసీపీ నచ్చితే మళ్ళీ ఓటు వేస్తారని, లేకపోతే ప్రభుత్వాన్ని మారుస్తారని అన్నారు. అర్బన్ ఓటింగ్ లో మాత్రం పది శాతం దాకా మీడియా పాత్ర ఉండవచ్చు అని అన్నారు. ఏపీలో చూస్తే జగన్ కి పాజిటివ్ గా సొంత మీడియా ఉందని, యాంటీగా టీడీపీ మీడియా ఉందని, ఒక విధంగా చూస్తే అటూ ఇటూ బాలన్స్ గానే కనిపిస్తోందని, కాబట్టి మీడియా రాతల వల్ల ఫలితాల్లో మార్పులు పెద్దగా ఉండకపోవచ్చు అని ఉండవల్లి విశ్లేషించారు.
Tags:    

Similar News