గ్రౌండ్ రిపోర్ట్: మెదక్ లో గెలుపెవరిది?

Update: 2019-04-03 14:30 GMT
పార్లమెంట్ నియోజకవర్గం : మెదక్
టీఆర్‌ ఎస్‌: కొత్త ప్రభాకర్‌ రెడ్డి
కాంగ్రెస్‌: గాలి అనిల్‌ కుమార్‌
బీజేపీ: రఘునందన్‌ రావు

హేమాహేమాలు పోటీ చేసిన పోరాటాల గడ్డ. మెతుకు సీమ నుంచి మెదక్‌ గా అవతరించిన మెదక్‌ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ,  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి, దివంగత నాయకుడు ఆలెనరేంద్ర లాంటి ఉద్దండులు ఒకప్పుడు పోటీ చేశారు. టీఆర్‌ ఎస్‌ ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గం గులాబీలకు కంచుకోటగా మారింది. ఇక్కడ టీఆర్‌ ఎస్‌ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా భారీ మెజారిటీతో విజయం సొంతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ నుంచి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి  గాలి అనిల్‌ కుమార్‌, బీజేపీ నుంచి రఘునందర్‌ రావు బరిలో ఉన్నారు.

* మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం చరిత్ర
అసెంబ్లీ నియోజకవర్గాలు: సిద్ధిపేట, మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌ చెరు, దుబ్బాక, గజ్వేల్‌
ఓటర్లు: 16 లక్షలు
 
1952లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 17 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో 9సార్లు కాంగ్రెస్‌, 4 సార్లు టీఆర్‌ ఎస్‌ గెలుపొందాయి. టీడీపీ, బీజేపీలు ఒక్కోసారి విజయం సాధించాయి. 1980లో భారత మాజీ ప్రధాని ఇందిరగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004లో టీఆర్‌ ఎస్‌ పార్టీ ఇక్కడి నుంచి మొదటిసారిగా పోటీ చేసింది. ఆ పార్టీ నుంచి బీజేపీ నుంచి వచ్చిన ఆలె నరేంద్ర ఘన విజయం సాధించారు. ఆ తరువాత 2009లో విజయశాంతి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. 2014లో మెదక్‌ ఎంపీగా, గజ్వేల్‌ ఎమ్మెల్యే పోటీ చేసి కేసీఆర్ గెలుపొందారు. ఇక్కడ కేసీఆర్‌ కు 3 లక్షల 97 వేల మెజారిటీ వచ్చి రికార్డుల్లోకెక్కారు. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేసి గజ్వేల్‌ ఎమ్మెల్యేగా, రాష్ట్రముఖ్యమంత్రిగా కొనసాగారు.

* కొత్త ప్రభాకర్‌ రెడ్డి మెజారిటీపైనే దృష్టి:
మెదక్‌ లోక్‌ సభ పరిధిలో సంగారెడ్డి మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులే బరిలో ఉన్నారు. పైగా ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మెదక్ కంటే కరీంనగర్‌ లోనే భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు. వెంటనే హరీశ్‌ రావు మాట్లాడుతూ కరీంనగర్‌ కంటే ఇక్కడ ఒక్క ఓటైనా ఎక్కువ తెప్పించుకుంటామని సవాల్‌ చేశారు. దీంతో ఇక్కడ గెలుపు కంటే మెజారిటీ మీదనే పోటీ నడుస్తోందని అర్థమవుతోంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కూడా మెదక్‌ పరిధిలో ఉండడంతో ఇక్కడి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ కేసీఆర్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్‌ రెడ్డిని బరిలోకి దించారు. ఆయన సైతం 3 లక్షల 60 వేల మెజారిటీ వచ్చింది.

*అనుకూలతలు:
-పార్టీ బలంగా ఉండడం
-సీఎం, హరీశ్‌ రావు లాంటి హేమాహేమీలున్న నియోజకవర్గాలుండడం
-గతంలో రికార్డు మెజారిటీ సాధించడం

*ప్రతికూలతలు:
-గజ్వేల్‌ కు మాత్రమే పరిమితమయ్యారన్న విమర్శ
-సొంత కేడర్‌ లేకపోవడం

*గాలి అనిల్‌ తో కాంగ్రెస్‌ గాలి వీచేనా..?
1980లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసిన నియోజకవర్గం ఇది. దీంతో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ కు కంచుకోటగా చానాళ్లు కొనసాగింది. 9 సార్లు ఇక్కడ గెలిచింది. అయితే టీఆర్‌ ఎస్‌ హవా మొదలయ్యాక మెదక్ లో కాంగ్రెస్ గెలువలేదు. కానీ కొన్ని చోట్ల టీఆర్ ఎస్ పై వస్తున్న వ్యతిరేకతతో ఓట్లు పడే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ కు చెందిన జగ్గారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.

* అనుకూలతలు:
-సానుభూతి ఓట్లు పడే ఛాన్స్‌
-గతంలో ఎంపీగా పనిచేసిన విజయశాంతికి అనివిధాల సహకారం ఉండడం

*ప్రతికూలతలు:
-కేడర్‌ పూర్తిగా లేకపోవడం
-కాంగ్రెస్‌ నుంచి వలసలతో పార్టీ శ్రేణుల్లో నిరాశ

* బీజేపీ ప్రభావం ఎంత.?
బీజేపీ నుంచి వాగ్ధాటి కలిగిన రఘునందర్‌ రావు బరిలో ఉన్నారు. కేంద్రంలో మోదీ హవా వీస్తుండడంతో తన గెలుపుకు కలిసొచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మరోవైపు ఇక్కడ ఒకసారి బీజేపీ కూడా గెలవడంతో కొంత ఆశ ఉందని అంటున్నారు.

*అంతిమంగా టీఆర్ ఎస్ కే మొగ్గు
మెదక్ అంటేనే టీఆర్ ఎస్ గా పరిస్థితి మారింది. కేసీఆర్ , హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఇక్కడ గెలుపు పక్కాగా మారింది.అయితే మెజారిటీపైనే దృష్టి సారించారు.హరీష్ రావు ఉండడంతో ఇక్కడ రికార్డు మెజార్టీ సాధించడంపైనే టీఆర్ ఎస్ ఫోకస్ చేసింది.కాంగ్రెస్, బీజేపీలు ఎంతవరకు పోరాడుతాయనేది వేచి చూడాలి.
    
    
    

Tags:    

Similar News