కేజ్రీవాల్ ఘ‌న విజ‌యాలు.. లోక్ స‌త్తా జేపీ ఎందుకు ఫెయిల‌య్యారు?

Update: 2020-02-15 20:30 GMT
వాస్త‌వానికి సివిల్ స‌ర్వీస్ విష‌యంలో అర‌వింద్ కేజ్రీవాల్ క‌న్నా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ పై కేడ‌ర్ అధికారి! కేజ్రీవాల్ క‌న్నా ఉన్న‌త ప‌ద‌వుల్లో ప‌ని చేశారు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్. అంతే కాదు.. కేజ్రీవాల్ క‌న్నా గొప్ప‌గా మాట్లాడ‌గ‌లరీయ‌న‌, దాంతో పాటు మేధావి అనే ట్యాగ్ కూడా పొందారు. వీరిద్ద‌రికీ ఉన్న సాప‌త్యాల్లో మ‌రో విష‌యం.. రాజ‌కీయాల్లోకి రావ‌డం. అర‌వింద్ కేజ్రీవాల్ క‌న్నా చాలా కాలం కింద‌టే జేపీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. రాజ‌కీయ పార్టీని పెట్టారు. పోటీ చేశారు. అయితే జేపీ పార్టీ ఎక్కడా పెద్ద‌గా డిపాజిట్లు కూడా సాధించ‌ లేక‌పోయింది. కేవ‌లం జేపీ మాత్ర‌మే ఎమ్మెల్యే గా నెగ్గారు. అది కూడా ఒక‌సారి మాత్ర‌మే! రెండోసారి ఎంపీగా పోటీ చేసి.. నెగ్గేయాల‌ని చూసి జేపీ ఓడిపోయారు.

ఆ వెంట‌నే ఆయ‌న రాజ‌కీయాల కాడి ప‌డ‌వేశారు. ఇక ఎన్నిక‌ల్లో పోటీ చేసేది లేద‌ని ప్ర‌క‌టించేశారు! అలా రాజ‌కీయ భారం ఆయ‌న దించుకున్నారు. ఆత‌ర్వా త లోక్ స‌త్తాను వారికి అప్ప‌గించ‌నున్నారు, వీరికి అప్ప‌గిస్తారు అనే ప్ర‌చారాలు కూడా జ‌రిగాయి.

ఇక అర‌వింద్ కేజ్రీవాల్ విష‌యానికి వ‌స్తే.. మొద‌టి సారి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ప్పుడు ఆయ‌న‌కూ అంత సానుకూల ఫ‌లితాలు రాలేదు. ఫ‌ర్వాలేద‌నే ఫ‌లితాలే వ‌చ్చాయి. కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ కొంత‌కాలానికి మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లి సంచ‌ల‌న విజ‌యం సాధించారు. 70కి 67 సీట్ల‌ను సాధించుకుని ముఖ్య‌మంత్రి అయ్యారు. ఐదేళ్ల పాల‌న అనంత‌రం కూడా అదే స్థాయి విజ‌యం తో మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయ్యారు! ఇలా ఏకే విజ‌య ప‌రంప‌ర కొన‌సాగుతూ ఉంది.

ఒకే త‌ర‌హా నేప‌థ్యం నుంచి వ‌చ్చి, ఒకే త‌ర‌హా పాల‌న‌ను అందిస్తామ‌ని ప్ర‌చారం చేశారు వీరిద్ద‌రూ. వీరిలో జేపీ ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పొంద‌లేదు, కేజ్రీవాల్ న‌మ్మ‌కం క‌లిగించారు. ఢిల్లీలో విద్యాధికులు ఎక్కువ అందుకే కేజ్రీవాల్ గెలిచార‌నేది ఒక వాద‌న‌. అయితే కేజ్రీవాల్ కు ఓట్లేసిన వారిలో ఆటోడ్రైవ‌ర్లు, స్ల‌మ్స్ లోని ప్ర‌జ‌లు కూడా ఉన్నారు! అస‌లు విద్యాధికులు పోలింగ్ స్టేష‌న్ల వ‌ర‌కూ వెళ్తార‌నే న‌మ్మ‌కాలు లేవు. కాబ‌ట్టి కేవ‌లం చ‌దువుకున్న వారు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌నే కేజ్రీ గెలిచారు అనేది అంత ప‌స‌లేని వాద‌న‌. ఇక జేపీ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. కానీ అదే నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న రెండో సారి పోటీ చేయ‌లేదు. ఎంపీగా వెళ్లిపోవాల‌ని చూశారు. గెల‌వ‌ లేక‌పోవ‌డం తో పోటీనే ఉండ‌ద‌ని ప్ర‌క‌టించేశారు! అలా ఆయ‌నకు పోరాడే త‌త్వం లేద‌ని కూడా స్ప‌ష్టం అయ్యింది.

కేజ్రీవాల్ కూడా మొద‌ట్లోనే ప్ర‌జ‌ల నుంచి అఖండ మెజారిటీ పొంద‌లేదు. కొంత రాజ‌కీయ పోరాటం త‌ర్వాతే ఆయ‌న‌కు ప్ర‌జాదర‌ణ ద‌క్కింది. జేపీ అలాంటి పోరాటం చేయ‌లేక‌ పోయారు. అదే స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప‌రిస్థితులు, ఇక్క‌డ జాతీయ- ప్రాంతీయ పార్టీల‌కు బ‌ల‌మైన నాయ‌క‌త్వాలు ఉండ‌టం కూడా జేపీ ఫెయిల్యూర్ కు ఒక కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు.
Tags:    

Similar News