వాళ్లందరికి కేసీఆర్ ఫోన్లు చేస్తున్నారెందుకు?

Update: 2021-05-28 12:30 GMT
మంత్రి వర్గ సహచరులు కావొచ్చు.. మరొకరు కావొచ్చు.. తాను కోరుకున్నప్పుడు మాత్రమే తనను కలిసేలా ఏర్పాట్లు చేయటం అందరు ముఖ్యమంత్రులకు సాధ్యమయ్యే పని కాదు. ఇందుకు ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలి. అలాంటి నైపుణ్యం కుప్పలు కుప్పలుగా ఉన్న కేసీఆర్ సారు.. తన సొంత పార్టీ నేతలకు తరచూ ఎంతలా షాకిస్తారో తెలిసిందే. పలువురు మంత్రులు ఆయన్ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నా.. వారిని దగ్గరకు రానివ్వని తీరును కేసీఆర్ తరచూ ప్రదర్శిస్తారన్న విమర్శ ఉంది.

అలాంటి ఆయన ఇటీవల కాలంలో తన తీరుకు భిన్నమైన రీతిలో రియాక్టు అవుతున్నారు. ఫాంహౌస్.. ప్రగతిభవన్ వదిలేసి ఆసుపత్రులకు వెళ్లటం.. బ్యాక్ టు బ్యాక్ రివ్యూలు నిర్వహించటం.. వ్యాక్సినేషన్.. లాక్ డౌన్.. కేసుల నమోదు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయటం.. గంటల కొద్దీ కార్యాచరణను సిద్ధం చేసేందుకు ఆయన తపిస్తున్నారు. అలాంటి కేసీఆర్.. తాజాగా తనదైన శైలిలో మంత్రులకు సర్ ప్రైజ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్ డౌన్ ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయాన్నిఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగింపా? లేదంటే ఆంక్షల్ని మరింత తగ్గించటమా? షాపుల పని వేళల్ని పెంచటమా? లాంటి అంశాలపై ఆయన కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా తన మంత్రి వర్గంలోని కొందరికి ఫోన్ చేసి.. లాక్ డౌన్ అమలు ఎలా ఉంది. దాని కారణంగా కరోనా కేసుల నమోదు తగ్గిందా? అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ అందుకున్న వారిలో మంత్రులు మహమూద్ అలీ.. ఇంద్రకరణ్ రెడ్డి.. నిరంజన్ రెడ్డి..తలసాని శ్రీనివాస్ యాదవ్. . ప్రశాంతరెడ్డి.. కొప్పుల ఈశ్వర్.. ఎర్రబెల్లి.. సత్యవతి రాథోడ్.. పువ్వాడ అజయ్.. జగదీశ్ రెడ్డి.. గంగులతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల వద్ద నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా లాక్ డౌన్ ఎపిసోడ్ లో కేసీఆర్ ఇచ్చిన సర్ ప్రైజ్ కు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా ఫుల్ హ్యపీగా ఫీల్ అయినట్లు చెబుతున్నారు. ఇలా తనకు కావాల్సిన వారిని.. తనకు అవసరమైన వేళ ఎలా సంతోష పెట్టాలన్న విషయంలో కేసీఆర్ కు మించినోళ్లు ఉండరన్న మాటను మరోసారి ఆయన ఫ్రూవ్ చేసుకున్నారనే చెప్పాలి.
Tags:    

Similar News