మహారాష్ట్రలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలైనట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల తర్వాత కేబినెట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత కానీ కేబినెట్ ను ఏర్పాటు చేయలేకపోయారు. మూడు పార్టీల మధ్యన అనేక చర్చల తర్వాత కేబినెట్ ఏర్పడింది. మూడు పార్టీలూ తమ తమ డిమాండ్ల మేరకు పదవులను పొందాయి. అలా రాజీకి వచ్చాయి.
పార్టీలు అయితే అలా రాజీకి వచ్చాయి కానీ, మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న వారు మాత్రం రాజీ పడటం లేదు. వారిలో కొందరు రాజీనామాలకు రెడీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కైలాష్ గోరంట్యాల్ తనకు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్నారట. ఆయన రాజీనామా ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. ఇది వరకే ఎన్సీపీ ఎమ్మెల్యే ఒకరు తనకు మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా అని ప్రకటించారు.
మరోవైపు శివసేన సహాయ మంత్రి కూడా ఒకరు అసంతృప్తితో ఉన్నారట. ఏదో స్థానిక పరిషత్ ఎన్నికకు సంబంధించి ఆయన అసంతృప్తితో మంత్రి పదవికి కూడా రాజీనామా అని ప్రకటించారట. ఈ అంశంపై ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడి నిర్ణయం అని ఆయన ప్రకటించినట్టుగా తెలుస్తోంది.
ఇలా మహారాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు వార్తల్లోకి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ఇబ్బందులను ఎలా పరిష్కరించుకుంటుందో!