చంద్రబాబు ఎందుకు నోరెత్తలేదు ?

Update: 2021-05-16 04:16 GMT
చెప్పుకోవటానికి తప్ప ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఎందుకు ఉపయోగపడటంలేదు. కళ్ళముందే తెలంగాణా ప్రభుత్వం ఏపికి అన్యాయం చేస్తున్నా గట్టిగా నిలదీసేందుకు నోరురాలేదు. నాలుగురోజుల పాటు ఏపి నుండి హైదరాబాద్ కు వైద్యం కోసం వచ్చిన అంబులెన్సులను తెలంగాణా-ఏపి సరిహద్దుల దగ్గర పోలీసులు నిలిపేశారు. అంబులెన్సుల్లోనే రోగులు చనిపోతున్నారని కుటుంబసభ్యులు ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.

అంబులెన్సులను, రోగులను తెలంగాణాలోకి రానీయకుండా అడ్డుకోవటం అమానవీయమని హైకోర్టు ఎంత చెప్పినా పోలీసులు లెక్క చేయలేదు. చివరకు లాభంలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని పట్టుకుని దుమ్ము దులిపేసి నేరుగా కంటెప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తామని తీవ్రంగా హెచ్చరించిన తర్వాత కానీ పోలీసులు దారిలోకి రాలేదు. ఏపి నుండి వచ్చే అంబులెన్సులను, రోగులను అనుమతించవద్దని కేసీయార్ ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.

ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే తెలంగాణాలోకి అనుమతించకపోవటంపై ఏపి చీఫ్ సెక్రటరీ తెలంగాణా చీఫ్ సెక్రటరీతో గట్టిగానే మాట్లాడారు. అయితే ఏపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సరిహద్దుల్లో ఇంతటి గందరగోళం జరుగుతున్నా మొదటి రెండురోజులు ఏపిలోని ప్రతిపక్షాల్లో ఒక్కటి కూడా నోరెత్తలేదు. తెలంగాణా ప్రభుత్వం ఏపి అంబులెన్సులను నిలిపేయటానికి జగన్మోహన్ రెడ్డి అసమర్ధతే కారణమని అచ్చెన్నాయడు అన్నారే కానీ కేసీయార్ ను నిలదీసే ధైర్యం చేయలేదు.

మూడోరోజు సీపీఐ సెక్రటరీ రామకృష్ణ తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతిప్పారు. ఆ తర్వాత బీజేపీ చీఫ్ సోమువీర్రాజు తెలంగాణా ప్రభుత్వం చర్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి+ వైసీపీ నేతలు కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇంతమంది కేసీయార్ ను తప్పుపట్టినా హైదరాబాద్ లోనే ఉంటున్న చంద్రబాబునాయుడు మాత్రం నోరెత్తలేదు. తెలంగాణా ప్రభుత్వం చర్యలు తప్పని ఒక్కసారి కూడా చెప్పలేదు.

వైద్యం కోసం ఏపి నుండి వచ్చే రోగులను కర్నాటక కానీ తమిళనాడు కానీ అడ్డుకోలేదు. మరి తెలంగాణా ప్రభుత్వం మాత్రం ఎందుకు అడ్డుకుందో అర్ధం కావటంలేదు. రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ విధంగా చూసినా ఏపి నుండి వచ్చే రోగులను తెలంగాణా అడ్డుకోవటం అప్రజాస్వామికమే కాదు అమానవీయం కూడా. నాలుగు రోజులపాటు ఇంత గందరగోళం జరిగినా చంద్రబాబు అసలు నోరిప్పకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.


Tags:    

Similar News