నిన్న మోడీని.. నేడు షాని క‌లిసిన గ‌వ‌ర్న‌ర్!

Update: 2019-06-10 11:38 GMT
ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. గంట‌ల తేడాతో ఇద్ద‌రు కీల‌క ప్ర‌ముఖుల‌తో రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ భేటీ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిన్న తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీకి స్వాగ‌తం ప‌లికిన వారిలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కూడా ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయ‌న ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రోజు ఉద‌యం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గ‌వ‌ర్న‌ర్ భేటీ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. వీరిద్ద‌రి మ‌ధ్య మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అని చెప్పిన‌ప్ప‌టికీ.. అలాంటిదేమీ లేద‌న్న‌ట్లుగా ప‌రిణామాలు ఉన్నాయి.

ఎందుకంటే.. మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయితే ప‌ది నిమిషాలు.. పావు గంట లేదంటే గంట‌.. కానీ రెండు గంట‌ల‌కు పైనే గ‌వ‌ర్న‌ర్ తో అమిత్ షా స‌మావేశం అంటే.. వారెన్ని ముఖ్య‌మైన విష‌యాల్ని చ‌ర్చించి ఉంటారో చెప్ప‌క త‌ప్ప‌దు. పెండింగ్ విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌తో పాటు.. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న సంబంధాల గురించి చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు.. ఆ వాద‌న‌లో ప‌స లేద‌ని చెప్పాలి.

ఎందుకంటే.. విభ‌జ‌న స‌మ‌స్య‌లు ఇప్ప‌టికిప్పుడు పుట్టుకొచ్చింది లేవు. ఒక‌వేళ‌.. అదే ఉన్నా.. అందుకోసం రెండు గంట‌ల పాటు భేటీ కావ‌టం వెనుక ఏదో ఒక బ‌ల‌మైన కార‌ణంగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ల‌ను ఏర్పాటు చేసే క్ర‌మంలో మీటింగ్ అని చెబుతున్నా.. ఆ వాద‌న‌లోనూ ప‌స లేద‌ని చెప్పాలి. ఎందుకంటే.. అలాంటిదే ఉంటే.. ఇంటికి పంపే గ‌వ‌ర్న‌ర్ తో షాలాంటి స్థాయి ఉన్న నేత భేటీ కారు. అయినా.. రెండు గంట‌ల‌కు పైనే స‌మావేశం ఉండ‌దు.

కొన్ని రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం.. కొద్ది రోజుల క్రితం ఏపీ విప‌క్ష నేత‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ తో భేటీ కావ‌టం.. కొన్ని అంశాలు చ‌ర్చించిన నేప‌థ్యంలో.. దానికి సంబంధించిన చ‌ర్చ ఏమైనా షా.. గ‌వ‌ర్నర్ల  మ‌ధ్య చోటు చేసుకుందా? అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే.. వీటికి సంబంధించిన అంశాలు ఇప్ప‌టికిప్పుడు కాకున్నా.. నెమ్మ‌దిగా అయినా బ‌య‌ట‌కు రావ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. 
Tags:    

Similar News