మార్కెట్ క‌న్నా సగం ధ‌ర‌కే పెట్రోల్ ఎగుమ‌తి?

Update: 2018-08-24 08:21 GMT
ప్ర‌స్తుతం భార‌త్ లో పెట్రోల్  - డీజిల్ ధ‌ర‌లు మండిపోతోన్న సంగ‌తి తెలిసిందే. వాటిని జీఎస్టీ ప‌రిధిలోకి తేవాల‌ని ప్ర‌జ‌లు కోరుతుంటూ....కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం నానాటికీ ధ‌ర‌లు పెంచుకుంటూ పోతోంది. పెంచేది రూపాయ‌ల్లో....త‌గ్గించేది పైస‌ల్లో అన్న చందంగా ఉంది పరిస్థితి. ఈ నేప‌థ్యంలోనే భార‌త్ నుంచి కొన్ని దేశాల‌కు ఎగుమ‌తి అవుతోన్న పెట్రోల్  - డీజిల్ ధ‌ర‌ల గురించి షాకింగ్ నిజం వెలుగులోకి వ‌చ్చింది. భార‌త్ లో పెట్రోల్ - డీజిల్ ధ‌ర‌క‌న్న సగం త‌క్కువ ధ‌ర‌కే ఎగుమ‌తి జ‌రుగుతోంద‌న్న సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డైంది. ఆర్టీఐ ద్వారా ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన మంగుళూరు రిఫైన‌రీ అండ్ పెట్రోలియం కెమిక‌ల్స్ లిమిటెడ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డం విశేషం.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి జూన్ 30 వ‌ర‌కు పెట్రోల్ - డీజిల్ ఎగుమ‌తి ధ‌ర‌ల‌ను ఆర్టీఐ ద్వారా ఓ సామాజిక కార్య‌క‌ర్త సేక‌రించారు. ఆ స‌మ‌యంలో లీట‌ర్ పెట్రోల్ రూ.32 నుంచి 34 వ‌ర‌కు - లీట‌ర్ డీజిల్ రూ.34 నుంచి 36 వ‌ర‌కు ఎగుమ‌తి చేశారు. అయితే, అదే స‌మ‌యంలో భార‌త్ లో పెట్రోల్ ధ‌ర రూ. 69.97 నుంచి రూ.75.55 వ‌ర‌కు - డీజిల్ ధ‌ర రూ.59.70 నుంచి రూ.67.38 వ‌ర‌కు ఉంది. అయితే, ధ‌ర‌ల్లో ఈ వ్య‌త్యాసం ఉండ‌డానికి గ‌ల కార‌ణాలు ఆస‌క్తిక‌రంగా ఉంది. భారీ మొత్తంలో క్రూడ్ ఆయిల్ దిగుమ‌తి చేసుకుంటోన్న భార‌త్ ...15 దేశాల‌కు రిఫైన్డ్ పెట్రోల్ - 37 దేశాల‌కు డీజిల్ ఎగుమతి చేయ‌డం నిజంగా ఆలోచించాల్సిన విష‌యం. అయితే,ఎక్సైజ్ డ్యూటీ - డీల‌ర్ క‌మిష‌న్ - వ్యాట్ వంటి కార‌ణాల‌తో భార‌త్ లోపెట్రోల్ - డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ట‌. రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు విధించే ప‌న్నుల వ‌ల్లే ఈ ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ట‌. లేదంటే, ఎగుమ‌తి చేసే పెట్రోల్  డీజిల్...దేశీయ అవ‌సరాల కోసం వాడే పెట్రోల్ - డీజిల్ ...దాదాపుగా ఒకే ధ‌ర‌కు ల‌భిస్తాయట‌.

Tags:    

Similar News