పులిహోర కలిపేసి.. ఈటలను ఆగమాగం చేశారా?

Update: 2021-05-28 09:30 GMT
ఈటల’ లాంటి మాటలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సరైన చెక్ చెప్పగల మొనగాడు ఎవరైనా ఉన్నారంటే ఈటల రాజేందర్ అంటూ సాగిన ప్రచారానికి.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈటల మీద సీఎం కేసీఆర్ కన్నెర్ర చేయటానికి ముందుకు ఆయన తన ఏర్పాట్లలో తాను ఉన్నారని.. పెద్ద సారు ఎప్పుడైనా దెబ్బ వేయొచ్చని.. ఆ వెంటనే చేపట్టాల్సిన కార్యాచరణపై క్లియర్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈటల విషయంలో జరిగిన ప్రచారానికి.. వాస్తవానికి మధ్య అంతరం మరీ ఇంతనా? అని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈటల మీద భూ కబ్జా ఆరోపణలు వచ్చిన గంటల వ్యవధిలోనే.. ఈటల శక్తిని.. సామర్థ్యాన్ని తెలిపేలా.. తెలంగాణ కోసం ఆయన చేసిన పనులు.. పడిన కష్టాన్ని కళ్లకు కట్టేలా పొట్టి వీడియోలు సోషల్ మీడియాలో హడావుడి చేశాయి. అంతేనా.. వెయ్యి కార్లతో తన నియోజకవర్గంలో జరిపిన భేటీకి సంబంధించిన భారీ బ్యాంగ్ సోషల్ మీడియా.. వాట్సాప్ లో కనిపించింది.

రోజులు గడుస్తున్న కొద్దీ.. ఇలాంటి ప్రచారం తగ్గిపోవటమే కాదు.. తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న విషయంలో ఈటల మహా కన్ఫ్యూజింగ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. తనపై అన్ని వైపుల నుంచి దాడి ముమ్మరం అవుతున్న వేళ.. పార్టీలో కొనసాగాలా? వద్దా? వేటు వేసే వరకు వేచి చూస్తూ ఉండాలా? అన్న ప్రశ్నలకు ఆయన దగ్గర సరైన సమాధానం లేదని చెబుతున్నారు. తనపై పెద్ద ఎత్తున దాడి జరుగుతూ.. తనను దాటి తన కొడుకు మీద కేసుల పెట్టే వరకు వెళుతున్నప్పటికీ.. వాయు వేగంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన వేళలో ఆచితూచి అన్నట్లు ఈటల వ్యవహరిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది.

గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు.. ఈటల అంత లావు.. ఇంత పొడుగు.. మావోడు లేస్తే కథ వేరేలా ఉంటుందన్న పులిహోర కలిపేసి.. ఈటలను అడ్డంగా బుక్ చేశారా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే.. కేసీఆర్ తన మీద గుర్రుగా ఉన్న విషయం ఈటలకు తెలియంది కాదు. ఆయన ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈటలకు మించి తెలిసినోళ్లు ఉండరు. అలాంటప్పుడు కేసీఆర్ తనను పక్కన పెట్టటం మొదలు పెట్టిన తర్వాత తానేం చేయాలన్న విషయంలో ఈటల పక్కా ప్లానింగ్ లో లేరా? ఆయన ప్లానింగ్ మరీ ఇంత పూర్ గా ఉంటుందా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.

ఇదంతా చూస్తే.. కేసీఆర్ తనపై వేటు వేసే విషయంలో ఈటల అంచనా పూర్తిగా విఫలమైందన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంతోనే.. ఈటల వెంటనే స్పందించలేకపోతున్నారని.. చకచకా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని.. కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వటంలోనూ తడబాటు కనిపిస్తోందని చెబుతున్నారు. ఏమైనా తనకు తానుగా సిద్ధం లేని ఈటలను.. ఆయనకున్న శక్తి సామర్థ్యాల్ని ఎక్కువగా చూపించి బుక్ చేశారా? అన్న ప్రచారం గడిచిన కొంతకాలంగా వినిపిస్తోంది. మొత్తంగా నిర్ణయాలు తీసుకోవటంలో వేగాన్ని.. తనకు అదే పనిగా షాకులు ఇస్తున్న కేసీఆర్ దూకుడుకు కళ్లాలు వేసే విషయంలో ఈటల తన మార్కును ఎప్పుడు చూపిస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారెందరో. మరి.. వారి ఆశల్ని ఈటల ఎప్పుడు తీరుస్తారో?
Tags:    

Similar News