జర్నలిస్టులకు ఆ ఎన్నికల వేళ కేసీఆర్ హామీ.. తాజా ఎన్నికల వేళ కేటీఆర్ మాట

Update: 2021-03-08 04:49 GMT
మిగిలిన వారి సంగతుల్ని పక్కన పెడదాం. నిత్యం రాజకీయ నేతలు.. పోలీసులు.. ఇతర అధికారులతో పాటు ప్రజలతో మమేకం అవుతూ ఎక్కడేం జరిగినా.. అక్కడకు ఉరుకులు పరుగులు తీసే జర్నలిస్టుల సమస్యల మీద హామీ ఇస్తే.. ఏం జరుగుతుంది? మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా..పాత్రికేయులకు ఇచ్చిన హామీని అమలు చేయటానికి యుద్ధ ప్రాతిపదికన పని పూర్తి చేస్తారని అనుకుంటారు. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి తెలంగాణలో ఉంది.

దాదాపు ఐదేళ్ల క్రితం అంటే.. 2016లో గ్రేటర్ హైదరాబాద్ లో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా పాల్గొన్న కార్యక్రమంలో సీఎం కేసీఆర్ నోటి నుంచి జర్నలిస్టులకు ఒక భారీ హామీ ఇచ్చారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను తమ ప్రభుత్వం ఇస్తుందని.. జర్నలిస్టులకు ట్రిఫుల్ బెడ్రూం ఇళ్లను ఇస్తామన్నారు. జర్నలిస్టుల జీవితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఆయన చెబుతూ.. మహా అయితే.. ఆర్నెల్లలో అంతా పూర్తిచేస్తామని తియ్యటి మాటలు చెప్పారు.

ఈ సీన్ ను ఇక్కడ కట్ చేస్తే.. కాలగర్భంలో ఐదేళ్లు కలిసిపోయాయి. ఈ మధ్యనే జీహెచ్ఎంసీకి మళ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. తాజాగా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంత పోటాపోటీగా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. జనరల్ ఎలక్షన్ కు ఏ మాత్రం తీసిపోనట్లుగా ఈ ఎన్నికలు సాగుతున్నాయి. ఇలాంటివేళ.. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జలవిహార్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

జర్నలిస్టులకు రూ.54 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించిన ఘనత కేసీఆర్ సర్కారుదే అని చెప్పిన ఆయన.. త్వరలోనే దాన్ని రూ.100కోట్లకు పెరిగేలా చేస్తామన్నారు.  ఉద్యమ సమయంలోతమ వెంట విద్యార్థులు.. లాయర్లు.. జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికే మీడియా అకాడమీకి రూ.15 కోట్ల ఖర్చుతో ఐదు అంతస్తుల భవనాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్లు.. ఇళ్ల స్థలాలపై తాము ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పిన ఆయన.. తాను మాట ఇస్తే ఇచ్చినట్లేనని.. కావాలంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో అడగాలన్నారు.

ఏడాది వ్యవధిలో కోర్టు ఇబ్బందుల్ని అధిగమించి మరీ.. హైదరాబాద్ లోని అందరు జర్నలిస్టులకు ఇళ్లను.. ఇళ్ల స్థలాల్ని అందిస్తామని చెప్పారు. అయితే.. ఐదేళ్ల క్రితం గ్రేటర్ ఎన్నికల వేళ.. ఇదే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇవ్వటం.. అదిప్పటివరకు అమలు కాకపోవటం గమనార్హం. అప్పట్లో తండ్రి ఇచ్చిన హామీనే.. తాజాగా కొడుకు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News