ఏఐతో మాన‌వ జాతి అంతం త‌ప్ప‌దా?

Update: 2022-09-19 02:30 GMT
గ‌త కొంత‌కాలంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అవుతున్న ప‌దం.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). తెలుగులో దీన్ని కృత్రిమ మేథ‌గా పిలుస్తున్నారు. మాన‌వ జీవితంలోకి ఇప్ప‌టికే ఇది ప్ర‌వేశించింది. ఏఐ టెక్నాల‌జీతో మ‌న స్మార్ట్ ఫోన్ ద్వారానే మ‌నం ఎక్క‌డ ఉన్నా ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, గ్యాస్‌, వాట‌ర్ ట్యాపుల‌ను ఇలా అన్నింటిని ఆపేయొచ్చు లేదా ఆన్ చేయొచ్చు. ఇంకా ఎన్నో విధాలుగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మాన‌వ జీవితాల‌ను మార్చేస్తుంద‌ని చెబుతున్నారు. అయితే ఏఐతో భ‌విష్య‌త్తులో మాన‌వ జాతి మ‌నుగ‌డ‌కే ముప్పు త‌ప్ప‌దా అంటే అవున‌నే అంటున్నారు కొంత‌మంది ప‌రిశోధ‌కులు. భవిష్యత్తులో కృత్రిమ మేథ‌ మానవ జాతిని అంతం చేస్తుంద‌ని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ మేర‌కు గూగుల్, ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీల‌కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో షాకింగ్  విషయాలు వెల్లడయ్యాయ‌ని చెబుతున్నారు. ఈ వివరాల‌ను ఏఐ మ్యాగజైన్ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. దీని ప్రకారం.. ప్రస్తుతం కృత్రిమ మేథ‌ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంద‌ని అంటున్నారు. ఒకవేళ ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది.. అందుబాటులోకి వస్తే అది మానవజాతి మనుగడకే ముప్పుగా మారుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీలో వాడుతున్న కోడింగ్, అందుకోసం అనుసరిస్తున్న గైడ్‌లైన్స్ ప్రకారం... రోబోలు మనుషులకు ఎలాంటి హాని చేయ‌వు. మ‌నం రోబోల‌కు హాని చేసినా సరే, తిరిగి రోబోలు మ‌న‌కు హాని చేయని విధంగానే అవి రూపొందుతున్నాయి.

అయితే.. ఆర్టిఫిషియ‌ల్‌ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే ఈ రూల్స్ మారిపోవచ్చ‌ని అంటున్నారు. ర‌జ‌నీకాంత్ రోబో సినిమాలో మాదిరిగా రోబోల మేథ‌స్సు మ‌నిషిని మించిపోయి మ‌నిషి ఇస్తున్న ఆదేశాల‌ను పాటించ‌క‌పోయినా.. స్వ‌యంసిద్ధంగా అవి ప్ర‌వ‌ర్తించినా కొంప‌లు కొల్లేరు కావ‌డం ఖాయ‌మంటున్నారు.

ఈ క్ర‌మంలో టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌ను ఉపయోగించుకుని రోబోలు వ‌నరుల కోసం మనుషులతోనే పోటీ పడొచ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో 'చీటింగ్ స్ట్రాటజీ' పెరిగిపోతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇది చివ‌ర‌కు మానవ జాతికి హాని చేసే వ‌ర‌కు వెళ్లొచ్చ‌ని హెచ్చ‌రిస్తున్నారు. అవి మనుషులు చెప్పే పనులు చేయడం మానేసి, సొంత టాస్కుల్ని పూర్తి చేసేందుకే ప్రాధాన్యం ఇస్తే ప్ర‌మాద‌మేనంటున్నారు. ఇలాంటి పరిణామాలతో మానవ జాతికి ముప్పు తప్పదని ప‌రిశోధ‌కులు నొక్కి వ‌క్కాణిస్తున్నారు.
Tags:    

Similar News