అయ్యన్న వారసుడికి అగ్రతాంబూలం... ?

Update: 2022-03-13 05:30 GMT
రాను గెలిస్తే సంతోషం. వారసుడు గెలిచి నిలిస్తే అంబరమంత సంబరం. ఇది ఏ తండ్రికి అయినా కామనే. ఇక విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి పుత్రోత్సాహం చాలానే ఉంది.

తన కొడుకు ఎమ్మెల్యే కావాలని ఆయన కోరిక. అది 2019లోనే ఆయన బయట పెట్టుకున్నారు. అయితే ఆ ఎన్నికలు కీలకం అని చెప్పి చంద్రబాబు వత్తిడి చేయడంతో అయ్యన్న పోటీకి దిగారు, ఓడిపోయారు కూడా.

ఇక ఈసారి మాత్రం తన కుమారుడు విజయ్ పాత్రుడుని ఎలాగైనా  చట్ట సభల్లో ప్రవేశించేలా చూడడమే లక్ష్యంగా అయ్యన్న పనిచేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆయన్ని టీడీపీ అధినాయకత్వానికి చేరువగా చేర్చేశారు.

చంద్రబాబుకు అయ్యన్న ఎంతటి సన్నిహితుడో లోకేష్ బాబుకు విజయ్ పాత్రుడు అంతకు మించి అన్నట్లుగా ఇపుడు టీడీపీలో సీన్ ఉంది. యువ నేతలంతా లోకేష్ టీమ్ గా ఉంటున్నారు.

వీరంతా డైలీ ఆన్ లైన్ లో అయినా ముచ్చటించుకుని ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీద రెడీ అవుతారు. ఇక ఈసారి అయ్యన్న నర్శీపట్నం నుంచి పోటీ చేస్తే అనకాపల్లి నుంచి విజయ్ పాత్రుడు ఎంపీగా బరిలోకి దిగుతారు అన్న ప్రచారం ఉంది.

మరో వైపు మాడుగుల సీటు మీద కూడా విజ‌య్ కన్ను ఉందని అంటారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ చంద్రబాబు, లోకేష్ బాబులకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి సీటు సమస్య ఉండదనే అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే అయ్యన్న పొలిటి బ్యూరో మెంబర్ గా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. ఇక విజయ్ పాత్రుడుకి కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఇపుడు దానికి అదనంగా మరో కీలక పదవిని కూడా ఇచ్చారు.

ఈ ఏడాది పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ శత జయంతి వేడుకలు. ఏడాది పొడవునా వాటిని ఘనంగా చేయడానికి టీడీపీ హై కమాండ్ రంగం సిధ్ధం చేస్తోంది.

దాంతో రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా తొమ్మిది మంది కీలక నేతలతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అయ్యన్న కుమారుడు విజయ్ కి చోటు దక్కడం పట్ల ఆయన వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. జూనియర్ అయ్యన్నకు టీడీపీకీ అత్యధిక ప్రయారిటీ దక్కుతోందని అంటున్నారు.

రానున్న రోజుల్లో విశాఖ జిల్లా రాజకీయాల్లో ఈ యువ నేత కీలకం అవుతారు అని కూడా అంటున్నారు. మొతానికి అయ్యన్నపాత్రుడు దూకుడుగా ఉంటారు. నోరు చేసుకుంటారు. కానీ కుమారుడు కంప్లీట్ డిఫరెంట్, సైలెంట్ గానే అన్నీ చక్కబెడతారు అని పార్టీ నేతలు  అంటున్నారు.


Tags:    

Similar News