బాబు ఈ సారి మాట నిలబెట్టుకుంటారా ?

Update: 2022-03-30 07:37 GMT
'రాబోయే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే కేటాయిస్తాను' ..ఇది తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ సభ ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 1982లో ఎన్టీయార్ పార్టీని పెట్టినప్పుడు యువత ఎలా రాజకీయాల్లోకి  వచ్చారో ఇపుడు కూడా యువత మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీలోకే రావాలని పిలుపిచ్చారు.

 పార్టీలో సీనియర్లకన్నా యువత వల్లే ఎక్కు ఉపయోగమన్నారు. సీనియర్లు నడుస్తారే కానీ పరిగెట్టలేరన్న విషయాన్ని గుర్తుచేశారు. పార్టీని పరుగులు పెట్టించే నాయకత్వం కావాలని, ఆ నాయకత్వం యువత వల్ల మాత్రమే సాద్యమవుతుందని చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్న విషయాన్ని అందరు గుర్తించాలన్నారు. మొత్తానికి చంద్రబాబు మాటల్లో అర్ధమైనది ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే అంతే సంగతులని.

 ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో టికెట్లు 40 యువతకు ఇవ్వటం సాధ్యమేనా ? ఇక్కడ యువత అంటే ఎవరు ? సీనియర్ల తరపున రాజకీయాలు చేస్తున్న వారసులేనా ? లేకపోతే కొత్త నాయకత్వం డెవలప్ అవటానికి అవకాశం ఇస్తారా ? సీనియర్ల మీద పార్టీలో ఎలాంటి వ్యతిరేకత ఉందో చాలామంది వాళ్ళ వారసుల మీద కూడా అలాంటి వ్యతరేకతే ఉంది.

వారసులను కాకుండా కొత్త నాయకత్వాన్ని తెరమీదకు తీసుకొస్తేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. వారసులకు టికెట్లిచ్చేసి యువతకు టికెట్లిచ్చామని చెప్పుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు.

 వారసత్వంతో  సంబంధంలేని యువతను ప్రోత్సహించాలి. అప్పుడే పార్టీలోకి యువత వచ్చే అవకాశముంది. 2019 ఎన్నికల్లో కూడా ఆరోపణలున్నవారికి టికెట్లిచ్చేది లేదని చెప్పారు. కానీ చివరకు ఏమైందంటే ఆరోపణలున్న వారికే టికెట్లిచ్చారు. అంతకుముందు బీసీలకే వంద టికెట్లిస్తానని ప్రకటించి చివరకు మాటతప్పారు. కాబట్టి మొహమాటానికి చంద్రబాబు స్వస్తిపలికితే కానీ ఉపయోగం ఉండదు.
Tags:    

Similar News