సోనియా పుత్ర ప్రేమ... కాంగ్రెస్ ని ముంచుతోందా...?

Update: 2022-08-26 08:43 GMT
ఎవరికైనా తమ సంతానం మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. వారి కళ్లకు పిల్లల తప్పులు కనిపించవు. ప్రేమలో అవి కొట్టుకుపోతాయి. పైగా తమ బిడ్డలు తమ కంటే గొప్పవారు కావాలన్న స్వార్ధం ఉంటుంది. దాంతో అన్నీ అందరికీ కనిపిస్తున్నా ఈ పుత్ర ప్రేమతో వారి కళ్ళు మూసుకుంటాయని అంటారు. ఇది చరిత్రలో ఎక్కడైనా ఉన్న విషయమే. ఇపుడు దేశంలో ఒక శతాధిక వృద్ధ పార్టీ కూడా పుత్ర ప్రేమ కారణంగా కృంగి పోతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది.

ఆ పార్టీ పేరు కాంగ్రెస్ అయితే ఆ తల్లి సోనియా గాంధీ. పుత్రుడు రాహుల్ గాంధీ. ఈ పుత్ర ప్రేమ దెబ్బకు  సీనియర్లు అనదగ్గ పునాదులు ఇపుడు కాంగ్రెస్ భవనాన్ని కదిలిస్తున్నాయి. వారు వేరుపడిపోతున్నారు. ఉండలేమని చెబుతున్నారు. రాం రాం అనేస్తున్నారు. కాంగ్రెస్ అంటే తాను అని దాదాపుగా అయిదు దశాబ్దాల బంధాన్ని పెనవేసుకున్న వరిష్ట నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి గుడ్ బై కొట్టారు అంటే పుత్ర ప్రేమతో సోనియా గాంధీ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని ఆరోపించడమే.

ఈ మేరకు గులాబ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ లో తన సుదీర్ఘమైన ప్రస్థానాన్ని నాలుగు పేజీల అతి పెద్ద లేఖ ద్వారా రాసుకువచ్చారు. అందులో ఆయన ఇందిరా గాంధీ నుంచి తన తన రాజకీయాన్ని మొదలెట్టి సోనియా గాంధీ దాకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించానని చెప్పుకొచ్చారు. 1977 ప్రాంతంలో కాంగ్రెస్ యువజన విభాగానికి సంజయ్ గాంధీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ప్రధాన కార్యదర్శిగా తాను ఉంటూ ఆ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళింది చెప్పుకొచ్చారు నాటి జనతా పార్టీ ప్రభుత్వం మీద ఎలా పోరాడింది కూడా వివరించారు.

సంజయ్ గాంధీ మరణం తరువాత రాజీవ్ గాంధీ కూడా తొలుత యువజన కాంగ్రెస్ తోనె తన ప్రస్థానం మొదలెట్టారని, ఆయన పక్కన తాను ఉన్నానని చెప్పుకున్నారు. ఇక ఇందిరా, రాజీవ్, పీవీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పలు మార్లు పనిచేసి ఎన్నో కీలకమైన శాఖలను చూశాను అని  గులాబ్ నబీ ఆజాద్ చెప్పుకున్నారు. సోనియా గాంధీలో నాయకత్వ  లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, ఆమె నాయకత్వాన రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆజాద్ గుర్తు చేశారు.

ఇక సీనియర్ల సలహాలు వింటూ వాటిని అమలులో పెడుతూ పార్టీని సోనియా ఒక గాటిన నడిపించారని ప్రస్తుతించారు. ఎపుడైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రవేసించారో నాటి నుంచే పతనం మొదలైంది అని ఆజాద్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. 2013లో రాహుల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడిగా బాధ్యతలు స్వీకరించాక సీనియర్లను పక్కన పెట్టి ఏ మాత్రం అనుభవం లేని జూనియర్ లతో  కొత్త కోటరీ తెచ్చి పార్టీని నాశనం చేశారు అని ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే రాహుల్ కి ఏ మాత్రం రాజకీయ పరిపక్వత లేదని ఆయన విమర్శించారు. ఆయనలో  నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమని తేల్చేశారు. ఇక 2020లో కాంగ్రెస్ని ప్రక్షాళన చేయమని తొలిసారిగా గట్టిగా లేఖ రాసిన గులాబ్ నబీ ఆజాద్ రెండేళ్ల పాటు ఉగ్గబట్టినా పార్టీ తీరు మారలేదు అంటున్నారు. చివరికి అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటూ కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టేశారు

ఇక్కడ ఆజాద్ వంటి సీనియర్ చెప్పిన మాటలను కొన్ని పరిగణన‌లోకి తీసుకుంటే 2013 నుంచి కాంగ్రెస్ లో రాహుల్ రాజ్యం నడుస్తోంది అనే తెలుసోంది. సోనియా గాంధీ కూడా కొడుకు మాటను కాదనలేక ఓకే చెబుతున్నారు అని అంటున్నారు. ఫలితంగా పార్టీ తీవ్రంగా నష్టపోతోంది అని అంటున్నారు. ఈ రోజున కాంగ్రెస్ కి తాను ప్రెసిడెంట్ గా ఉండను అని రాహుల్ చెబుతున్నా ఎవరినో తెచ్చి పెట్టినా అన్ని నిర్ణయాలూ ఆయనే తీసుకుంటారు అన్నది తెలిసిన విషయమే. అంటే రాహుల్ మాటే చలామణీ అవుతుంది. ఆయన చూస్తే అపరిపక్వతతో వ్యవహరిస్తారు అని గులాబ్ నబీ ఆజాద్ అంటున్నారు.

తాను రాసిన లేఖలోనే చైల్డిష్ గా రాహుల్ వ్యవహరిస్తారు అని ఘాటైన మాటనే ఆయన వాడారు. అంటే సోనియా గాంధీ వయోభారంతో నిలువరించలేని స్థితిలో రాహుల్ చేష్టలు ఉన్నాయని ఆజాద్ భావన, ఆరోపణ. ఇక రాహుల్ తన తండ్రి రాజీవ్ నుంచి, కానీ నాన్నమ్మ ఇందిరమ్మ లా కానీ బాబాయ్ సంజయ్ లా కానీ డైనమిక్ లీడర్ కారనే ఆజాద్ అంచనా కట్టేశారు. ఇక ఆయన్ని నిరోధించి పార్టీని బ్యాలన్స్ చేయడం సోనియా వల్ల కావడంలేదు అన్న అంచనాతోనే ఆజాద్ పార్టీకి స్వస్తి అనేశారు.

 మరి ఆజాద్ ఒక్కరే కాదా బయటకు  వెళ్ళిపోయింది అని అనుకోవచ్చు. కానీ ఆయన సీనియర్ మోస్ట్ నేత. ఆయన రాజీనామా ప్రభావం పార్టీ మీద తీవ్రంగానే ఉంటుంది అంటున్నారు. అన్నింటికీ మించి రాహుల్ వల్ల కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదు అని ఆయన అన్న మాటలు పార్టీలో మంట పెట్టినట్లే అంటున్నారు.
Tags:    

Similar News