కేసీఆర్ కు షాక్‌.. ‘ద‌ళిత బంధు’ ఆగిపోతుందా?

Update: 2021-07-28 15:50 GMT
'ద‌ళిత బంధు..' ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా న‌లుగుతున్న అంశం. సాధార‌ణ స‌మ‌యంలో ఈ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టి ఉంటే అంద‌రూ స్వాగ‌తించేవారు. కానీ.. ఎల‌క్ష‌న్‌ ముందు తేవ‌డం వ‌ల్ల‌నే అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేకాదు.. ఈ ప‌థకాన్ని ఎన్నిక‌ల కోస‌మే తెచ్చామ‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రే వ్యాఖ్యానించ‌డం.. దాన్ని ఇలా బ‌హిరంగంగా స‌మ‌ర్థించుకోవ‌డం.. అవాంఛ‌నీయ‌ రాజ‌కీయ సంప్ర‌దాయాన్ని మొద‌లు పెట్టిన‌ట్టు అయ్యింద‌నే విమ‌ర్శ‌లు తీవ్ర‌మ‌వుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ఈ ప‌థ‌కంపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు వెళ్ల‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

ఈ ప‌థ‌కంపై ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్త‌య్యేంత వ‌ర‌కూ నిలిపేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరింది. ఒక‌వేళ వెంట‌నే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తే.. హుజూరాబాద్ లో మిన‌హా.. రాష్ట్రంలోని మిగ‌తా 118 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌లు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. ఈ మేర‌కు ఫోరమ్ కార్య‌ద‌ర్శి ప‌ద్మ‌నాభ రెడ్డి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ జోక్యం చేసుకోవాల‌ని కోరారు. ఎన్నిక‌ల కోస‌మే ఈ ప‌థ‌కం తెస్తున్నామ‌ని కేసీఆర్ బ‌హిరంగంగా చేసిన వ్యాఖ్య‌ల‌ను సైతం ఈ లేఖ‌లో ఉద‌హ‌రించారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రే ఎన్నిక‌ల కోసం ప‌థ‌కాన్ని తెస్తున్నామ‌ని వ్యాఖ్యానించ‌డం.. రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. ద‌ళిత బంధు ప‌థ‌కం మంచిదే అని, అయితే.. ఎన్నిక‌ల కోస‌మే తీసుకురావ‌డం.. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్ట‌డం కింద‌కే వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ''నేను హిమాలయాల్లో ఉండే సాధువును కాదు.. ఒక రాజ‌కీయ‌వేత్త‌ను.. ద‌ళిత బంధు ప‌థ‌కం ఉప ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌డానికే ప్ర‌వేశ‌పెట్టాం.. ఇందులో త‌ప్పేముంది?'' అంటూ చేసిన వ్యాఖ్య‌లు ఏ మాత్రం స‌మ‌ర్థ‌నీయం కాద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

ఈ విధంగా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని సీఎం అమ‌లు చేస్తున్న విధానాన్ని తూర్పార‌బ‌డుతూ.. ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసింది. నిజానికి ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల రాష్ట్ర‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ్య‌క‌మ‌య్యాయి. ఒక సీఎం నేరుగా ఎన్నిక‌ల కోస‌మే ప‌థ‌కం పెడుతున్నామ‌ని చెప్ప‌డ‌మంటే.. ప్ర‌జాధ‌నంతో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు కొన‌డం కిందే లెక్క అని విప‌క్షాలు దుయ్య‌బ‌ట్టాయి. మేధావులు సైతం ఈ విధానాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌జాధ‌నంతో ఎన్నిక‌ల్లో ఓట్లు కొన‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

గ‌తంలో ఇలాంటి వ్య‌వ‌హారాలు చేప‌ట్టినా.. అది ఎన్నిక‌ల‌కు చాలా కాలం ముందే చేసేవారు. అదికూడా ప్ర‌జ‌ల కోస‌మే చేస్తున్న‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చేవారు. ప్ర‌సంగాల్లోనూ అదేవిధంగా చెప్పేవారు. కానీ.. ఇప్పుడు నేరుగా తాము ఎన్నిక‌ల కోస‌మే ఈ ప‌నిచేస్తున్నామ‌ని చెప్ప‌డం ద్వారా.. జ‌నాల్లోకి ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అంటే.. అధికారంలో ఉన్న పార్టీ స్వ‌యంగా ఎన్నిక‌ల్లో ఓట్లు కొనేందుకే ప‌థ‌కాలు పెట్టొచ్చ‌ని, భ‌విష్య‌త్ లోనూ ఇదే విధానాన్ని కొన‌సాగిస్తామ‌ని చెబుతున్నారా? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విధానాన్ని లీగ‌ల్ చేస్తున్నారా? అని కూడా నిల‌దీస్తున్నారు.

ఈ ప‌ద్ధ‌తిని ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌శ్నించింది. ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం దృష్టికి సైతం తీసుకెళ్లింది. మ‌రి, దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎలా స్పందిస్తుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు నియ‌మావ‌ళి అమ‌లులో లేదు కాబ‌ట్టి.. ఏం చేస్తుంద‌నే ఉత్కంఠ నెల‌కొంది. సాధార‌ణంగా ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్ట‌డం కాకుండా.. ఈ ప‌థ‌కం కేవ‌లం ఎన్నిక‌ల కోస‌మేన‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించ‌డం తీవ్ర స్థాయి విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. యాక్ష‌న్ తీసుకున్నా లేకున్నా.. ఎన్నిక‌ల క‌మిష‌న్ దీనిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తే మాత్రం.. కేసీఆర్ కు నైతికంగా మ‌చ్చ ప‌డిన‌ట్టేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News