పార్టీల వల్ల హిందువులే నష్టపోతారా ?

Update: 2021-09-08 05:34 GMT
రాష్ట్రంలో చవితి రాజకీయాలు ఎక్కువైపోయాయి. బహిరంగ ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలు చేయవద్దన్న ప్రభుత్వ ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోను పాటించేది లేదని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు. పైగా ప్రభుత్వ ఆదేశాలను హిందూమత వ్యతిరేక చర్యలుగా అభివర్ణిస్తూ రెచ్చిపోతున్నారు. విషయం ఏమిటంటే ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి రూపొందించినవి కావు. కేంద్రం జారీ చేసిన ఆదేశాలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వినాయక చవితి ఉత్సవాలు జరిపి తీరుతామని ప్రకటించిన పార్టీల వైఖరితో అంతిమంగా నష్టపోయేది హిందువులే అన్న విషయాన్ని మరచిపోతున్నారు. చవితి ఉత్సవాలను జరిపేది, భారీఎత్తున విగ్రహాలను ఏర్పాటుచేసి ఫూజలు జరిపేది కేవలం హిందువులు మాత్రమే. వినాయకచవితి ఉత్సవాలంటే ఒకరోజు తో ముగిసేది కాదు. విగ్రహాన్ని నిమజ్జనం జరిపేంతవరకు కొన్నిచోట్ల మూడు రోజులు, మరికొన్నిచోట్ల తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుపుతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడుతారన్నది వాస్తవం.

ఇక్కడెవరికైనా కరోనా వస్తే అది అందరికీ వ్యాపిస్తుంది. అప్పుడు నష్టపోయేది హిందువులు మాత్రమే అని ప్రతిపక్ష నేతలు మరచిపోతున్నారు. మరి ఒకచోట అంత మంది పూజలు, ఉత్సవాలపేరుతో గుమిగూడినపుడు కచ్చితంగా కరోనా వైరస్ సోకే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు కేంద్రం ఆదేశాలను జగన్ ప్రభుత్వం జారీచేసింది. అయితే ప్రభుత్వ ఉద్దేశ్యాలను ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ పై హిందూమత వ్యతిరేక ముద్ర వేస్తున్నారు.

మొన్నటికి మొన్న నెల్లూరులో ఎంతో గొప్పగా జరిగే రొట్టెలపండుగను కూడా ప్రభుత్వం నిషేధించింది. రొట్టెల పండుగను ముస్లింలు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. కేవలం కరోనా వైరస్ కారణంగానే ఈ పండుగను ప్రభుత్వం రద్దు చేయించింది. మసీదులు, చర్చిల్లో ప్రార్ధనలంటే అవి కేవలం రోజుమొత్తం మీద కొంత సమయం మాత్రమే జరుగుతాయి. కరోనా సమస్య బాగా తీవ్రంగా ఉన్న సమయంలో వాటిని కూడా ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు దేవాలయాలను ఎక్కడా మూయలేదు, పూజలూ ఆగలేదన్న విషయాన్ని వీళ్ళు మరచిపోతున్నారు.

ఇదే వినాయక చవితి ఉత్సవాలంటే ఉదయం నుంచి రాత్రి వరకు జనాలు ప్రత్యేకంగా యువత, పిల్లలు మండపాల్లోనే కాలక్షేపం చేస్తారు. అందుకనే బహిరంగ ప్రదేశాల్లో మండపాలు పెట్టి ఉత్సవాలు వద్దని ప్రభుత్వం చెప్పింది. బహిరంగ ఉత్సవాలు వద్దని చెప్పిందే కానీ పండగను పూజా సామగ్రితో ఇళ్ళల్లో చేసుకోవద్దని కానీ, విగ్రహాలను కొనద్దని కానీ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. కానీ విచిత్రమేమిటంటే పూజలు చేసుకోవద్దని, విగ్రహాలు కొనద్దని చెప్పటానికి ప్రభుత్వానికి ఏమి అధికారం ఉందని చంద్రబాబు, వీర్రాజు, పవన్ అడగటమే విచిత్రం.
Tags:    

Similar News