ముద్రగడ మాట జగన్ వింటారా...?

Update: 2022-12-27 11:30 GMT
ఏపీ రాజకీయాల్లో ఇపుడు సామాజిక సమీకరణల పర్వం సాగుతోంది. ఏ కులం ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు అన్న లెక్కలే ఇపుడు రాజకీయ పార్టీల చర్చల్లో ప్రధానంగా కనిపిస్తునాయి. ఈ నేపధ్యంలో 2024 నాటికి కాపులు బలీయమైన ప్రభావవంతమైన శక్తిగా మారుతారు అన్నది ఒక కచ్చితమైన అంచనాగా ఉంది. కాపులు ఒక వైపు బీసీలు మరో వైపు ఏపీ రాజకీయాన్ని మారుస్తారు అన్నది కూడా అంతా చెప్పే మాట.

ఇక వైసీపీకి గత ఎన్నికల్లో కాపులు బీసీలు కూడా మద్దతు ఇచ్చారు. అందువల్లనే  జగన్ 151 సీట్లతో విజయం సాధించారు. ఇపుడు సామాజిక నేపధ్యం మారుతోంది. కాపులు వైసీపీకి దూరం అవుతున్నారా అనే కంటే కూడా జనసేనకు దగ్గర అవుతున్నారు అనడం సబబు. వారికి తమ సామాజిక వర్గం ఆకాంక్షలు చాలా ముఖ్యంగా కనిపిస్తున్నాయి.

దాంతో కాపులను ప్రసన్నం చేసుకునే పనిని అన్ని పార్టీలు చేస్తున్నాయి. వైసీపీ దానికి అతీతం కాదు. ఒక వైపు బీసీలను దువ్వుతూనే మరో వైపు కాపులను కూడా జారిపోనీయని రాజకీయాన్ని ఆ పార్టీ చేస్తోంది. కాపులను బీసీలలో చేర్చాలి అన్నది మూడు దశాబ్దాల నాటి డిమాండ్.ఈ విషయంలో కాపులు ఎపుడూ వెనక్కి తగ్గడంలేదు కూడా.

తమకు బ్రిటిష్ వారి టైం లో బీసీలుగా రిజర్వేషన్లు ఉన్నాయని దాన్ని 1960 దశకం దాకా కొనసాగించారని, అయితే ఆ మధ్యలోనే బీసీ రిజర్వేషన్లకు గండి కొట్టారని కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదని, తాము గతంలో ఇచ్చిన వాటినే పునరుద్ధరించమని కోరుతున్నామని అంటున్నారు.

అయితే బీసీలలో కాపులను చేర్చడం అంటే అది పెద్ద విషయంగా ఉంది. దానికి చాలా కసరస్త్తు చేసినా జాతీయ స్థాయిలో కూడా ఫైట్ చేయాలి. అయినా జరుగుతుంది అన్న నమ్మకం లేదు. కానీ జగన్ చేతిలో ఒక విషయం ఉంది. ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు కేంద్రం పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. తాజాగా కేంద్రం మరో విషయం స్పష్టం చేసింది. అదేంటి అంటే ఈ రిజర్వేషన్లలో ఎవరికైనా సబ్ క్యాటగిరీ కింద ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. అది రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం పేర్కొంది.

అంటే పది శాతం ఈబీసీలకు ఇచ్చే రిజర్వేషన్లలో అయిదు శాతం కాపులకు ఇస్తూ చంద్రబాబు సర్కార్ గతంలో చేసిన చట్టం చెల్లుతుందని కేంద్రం చెప్పినట్లూ అయింది. దాంతో ఇపుడు అంతా దాన్ని అమలు చేయమని కోరుతున్నారు. కాపులను బీసీలలో చేర్చాలని పట్టుబట్టిన ముద్రగడ పద్మనాభం సైతం ఇపుడు ఆ అయిదు శాతం రిజర్వేషన్లు అమలు  చేయాలని జగన్ కి లేఖ రాశారు.

ఈ సందర్భంగా ఆ లేఖలో ఎక్కడా జగన్ని విమర్శించలేదు, పైగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ఈ పని చేస్తే కాపులలో మీకే మంచి పేరు వస్తుంది, మీకు మంచి జరుగుతుంది అంటూ పెద్ద మనిషిగా ముద్రగడ కోరారు. ఒక విధంగా జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తూ ముద్రగడ రాసిన ఈ లేఖ ఇపుడు చర్చకు తావిస్తోంది. మరి జగన్ ఈ లేఖ మీద ఏం చేస్తారు అన్నదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

ముద్రగడ పెద్ద మనిషి. ఆయన బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు. పైగా వచ్చే ఎన్నికల్లో ముద్రగడ కుటుంబాన్ని వైసీపీ వైపుగా తిప్పాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఊరకే ముద్రగడ వైసీపీలోకి వచ్చినా లాభం ఉండదు. అందువల్ల ఆయన రాసిన లేఖ మేరకు ఆయన కోరిక తీర్చడం ద్వారా అటు కాపులలో ముద్రగడను మళ్ళీ నిలబెట్టి ఆయనని తమ వైపు తెచ్చుకోవడం ద్వారా 2024 ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు.

నిజానికి కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని వైసీపీలో కూడా చర్చ సాగుతోంది. కానీ ఊరకే ఇస్తే రాజకీయంగా మైలేజ్ రాదు కాబట్టి ముద్రగడ ద్వారా ఆ డిమాండ్ ని పలికించి తాము చేసినట్లుగా చేస్తే ముద్రగడని దగ్గరకు తీసుకోవచ్చు, కాపుల విశ్వాసమూ పొందవచ్చు అన్నది వైసీపీ ఎత్తుగడ అని అంటున్నారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొత్త ఏడాది జరుగుతాయని అంటున్నారు. ఆ సమావేశాలలో కాపుల రిజర్వేషన్ విషయంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News