ఆ బీజేపీ ఎమ్మెల్యే పైన దేశ ద్రోహం కేసు పెట్టనున్నారా?

Update: 2021-05-17 23:30 GMT
భావస్వేచ్ఛ దేశంలో ఎక్కువ. ఆ మాటకు వస్తే.. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజలకు ప్రజాస్వామ్యం ఇచ్చిన వరంగా పలువురు చెబుతారు. వాస్తవంగా అలాంటి పరిస్థితి ఉందా? అన్న ప్రశ్నను ఇప్పుడు సంధిస్తే.. సూటిగా సమాధానం ఇచ్చే వారు కనిపించరు. ఎందుకంటే.. గతంలో ఎప్పుడూ లేని సిత్రమైన పరిస్థితి దేశంలో ఇప్పుడు ఉంది. ప్రజల పక్షాన మాట్లాడటం ఇప్పుడు నేరం అవుతోంది. కొన్నిసార్లు అది దేశ ద్రోహంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వ్యవస్థలు మొత్తం ముడుచుకుపోయినట్లుగా ఇప్పటి పరిస్థితి ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న వేళ.. మోడీ జమానాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్ మిగిలిన వారికి కాస్త భిన్నమైన వారు. స్వేచ్ఛగా మాట్లాడాలన్న కోరిక ఎక్కువ. మనసుకు అనిపించింది చెప్పేందుకు సంశయించరు. అదే ఆయన్ను మిగిలిన వారికి భిన్నంగా మార్చటమే కాదు.. బీజేపీకి చెందిన పలువురు నేతలు ఆయనంటే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆయన తర్వాతి కాలంలో బహుజన సమాజ్ పార్టీ నేతగా సుపరిచితుడు. 2017లో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన..  ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజల్ని పక్కన పెట్టేలా చేసే చేష్టలు ఆయనకు అస్సలు నచ్చవు.

సొంత పార్టీ నేతలైనా సరే.. తప్పు చేస్తే చెడామడా వాయించటం అలవాటు. గత ఏడాది లాక్ డౌన్ ప్రకటించి.. కరోనాను పారదోలటం కోసం చప్పట్లు కొట్టటం.. ప్లేట్లు వాయించటంలాంటి పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ తీరును ఆయన తీవ్రంగా తప్పు పడతారు. చప్పట్లు కొట్టి వైరస్ ను నివారిస్తామా? ఇది మూర్ఖత్వానికి పరాకాష్ఠ. దీపాలు వెలిగించిన కరోనాను నివారించగలమనుకుంటే ప్రజలు మీలా మూర్ఖులు కాదంటారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తే దేశ ద్రోహం కేసులు నమోదు చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఎక్కువగా మాట్లాడితే తన మీదా దేశ ద్రోహం కేసు వేస్తారని వ్యాఖ్యానించారు. పార్టీలో ఎమ్మెల్యే పరిధి చాలా పరిమితమని.. మీడియాకు ఎలాంటి స్టేట్ మెంట్ ఇచ్చినా దేశ ద్రోహం కేసు మీద పడుతుందన్నారు. ''అసలు ఎమ్మెల్యేలకు ఏం స్టేటస్ ఉంది? ఒకవేళ నేను ఎక్కువగా మాట్లాడితే వెంటనే నాపైన దేశ ద్రోహం కేసు నమోదవుతుంది. ఎమ్మెల్యేలు వాళ్ల మెదళ్లతో మాట్లాడతారని మీరు అనుకుంటున్నారా?'' అంటూ ఆయన వ్యాఖ్యలు కమలనాథులకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. సొంత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడని ఈ బీజేపీ ఎమ్మెల్యే ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి.. ఆయనపై ఎలాంటి చర్యల కత్తి మీద పడుతుందో చూడాలి.
Tags:    

Similar News