టీఆర్ఎస్‌ను క్యాంపులు కాపాడ‌తాయా..?

Update: 2021-12-01 13:30 GMT
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. త‌మ అభ్య‌ర్థుల గెలుపు కోసం ఏ ఒక్క అవ‌కాశం కూడా వ‌దులుకోవద్ద‌ని భావిస్తోంది. ఇందుకోసం క్యాంపుల రాజ‌కీయాల‌కు తెర‌లేపింది. త‌మ పార్టీకి చెందిన స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులంద‌రినీ క్యాంపుల‌కు త‌ర‌లిస్తోంది. ఇత‌ర‌ పార్టీల ఓట‌ర్ల‌ను కూడా మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే నిధులు, విధులు లేకుండా అచేత‌నంగా మిగిలిపోయిన స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధులు ప్ర‌భుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విష‌యంలో అధికార పార్టీకి గుబులు మొద‌లైంది. క్యాంపులు నిర్వ‌హిస్తున్నా ఎక్క‌డ హ్యాండిస్తారోన‌నే ఆందోళ‌న నెల‌కొంది.

తెలంగాణ‌లో ఇటీవ‌ల 19 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యేల కోటాలో ఆరు.. స్థానిక సంస్థ‌ల కోటాలో 12 స్థానాలు, గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్ప‌డింది. ఎమ్మెల్యేల కోటాలో ఆరుగురు, గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఒక స్థానానికి ఇప్ప‌టికే నియామ‌కాలు జ‌రిగిపోయాయి. స్థానిక సంస్థ‌ల కోటాలో 12 స్థానాల‌కు 6 ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. నిజామాబాద్ నుంచి క‌విత‌, రంగారెడ్డి నుంచి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, వ‌రంగ‌ల్ నుంచి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, కూచుకుళ్ల దామోద‌ర్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

మ‌రో ఆరుచోట్ల డిసెంబ‌రు 10న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. టీఆర్ఎస్ త‌ర‌పున ఆదిలాబాద్ నుంచి దండె విఠ‌ల్‌, న‌ల్ల‌గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖ‌మ్మం నుంచి తాతా మ‌ధుసూద‌న్‌, క‌రీంన‌గ‌ర్ నుంచి ఎల్‌.ర‌మ‌ణ‌, టి.భానుప్ర‌సాద‌రావు, మెద‌క్ నుంచి డాక్టర్ యాద‌వ‌రెడ్డి బ‌రిలో నిలిచారు. స్వ‌తంత్రులు, ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకోక‌పోవ‌డంతో ఎన్నిక అనివార్య‌మైంది.

పోటీలో ఉన్న ఆరుగురిని గెలిపించి మండ‌లికి తీసుకొచ్చే బాధ్య‌త మంత్రులు, సీనియ‌ర్ ఎమ్మెల్యేల పైన ఉంచారు అధినేత కేసీఆర్‌. ఆయా జిల్లాల సీనియ‌ర్ నాయ‌కుల‌కు ఇది ఒక స‌వాలుగా మారింది. దీంతో క్యాంపుల‌కు తెర‌లేపారు. మెజారిటీ స్థానిక ప్రజాప్ర‌తినిధులు అధికార పార్టీ వారే ఉన్నారు కాబ‌ట్టి టీఆర్ఎస్ గెలుపు న‌ల్లేరుపై న‌డక కావాలి. కాకుంటే జ‌డ్పీటీసీ, ఎంపీటీసీల‌కు రెండున్న‌రేళ్లుగా విధులు, నిధుల విషయంలో ఉన్న అసంతృప్తి ఎక్క‌డ త‌మ‌కు గండి కొడుతుంద‌నే భావ‌న‌లో ఉన్నారు.

ఆ ప‌రిస్థితి రాకుండా క్యాంపులు ఏర్పాటు చేసి వారిని గోవా ఇత‌ర విహార యాత్ర‌ల‌కు త‌ర‌లిస్తున్నారు. క్యాంపుల్లో వారు అడిగిన‌వ‌న్నీ స‌మ‌కూర్చి, ఓటు వేయ‌డంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు. పోలింగ్ తేదిన‌ ఉద‌యానికి వ‌చ్చేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. ఇంత చేసినా ఒక్క ఓటు త‌గ్గినా అది త‌మ‌కు ఇబ్బందిగా భావిస్తున్నారు.




Tags:    

Similar News