ఉద్యోగుల సమ్మెకు బ్రేక్ పడుతుందా ?

Update: 2022-02-02 05:48 GMT
పీఆర్సీ వివాదంలో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగుల నేతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వివాద పరిష్కారానికి సమ్మె మార్గం కానేకాదని స్పష్టంగా చెప్పింది. పీఆర్సీ వివాదంపై కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పీఆర్సీ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతున్నపుడు సమ్మె చేయటంలో అర్ధమేంటి అని ఉద్యోగులను, ఉద్యోగుల నేతలను నిలదీసింది.

 ఒకవైపు న్యాయ స్ధానంలో విచారణ జరుగుతున్న సమయంలో ఇదే విషయమై సమ్మె చేయటమంటే కోర్టుపై ఒత్తిడి తేవడం కాదా అంటు సూటిగా ప్రశ్నించింది. విచారణ సందర్భంగా ఇచ్చిన మధ్యంతర ఆదేశాలతో ఉద్యోగులు సమ్మెకు వెళ్ళరనే తాము భావిస్తున్నట్లు కోర్టు చెప్పింది. ఐఆర్ కు ఫిట్మెంట్ కు మధ్య ఉన్న తేడా 4 శాతం తేడాను ఉద్యోగుల జీతాల్లో నుంచి రికవరీ చేయద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

 ఒకవైపు విచారణ జరుగుతుండగా 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం పెట్టుకోవటంలో ఉద్దేశ్యమేమిటో చెప్పాలని కోర్టు ఉద్యోగుల, ఉపాధ్యాయులను అడిగింది. ఆందోళనలు, సమ్మెల ద్వారా సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశ్యం ఉన్నపుడు కోర్టులో కేసు ఎందుకు వేశారంటు మండిపడింది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ప్రతి ఉద్యోగికి, ప్రతి పెన్షనర్ కు జీతం, పెన్షన్ పెరుగుతున్నపుడు ఇంకా ఆందోళనలేంటి ? సమ్మెలేంటి అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.

 ఇదే సమయంలో ఉద్యోగులు అందుకున్న జీతాలు, పెన్షన్లలో ప్రతి ఉద్యోగికి, పెన్షనర్ కు జీతం, పెన్షన్ ఎంతెంత పెరిగిందనే విషయాన్ని చీఫ్ సెక్రటరీ వివరించారు. జీతాలు అందుకున్న ఉద్యోగుల, పెన్షన్ అందుకున్న పెన్షనర్ల పే స్లిప్పులను చీఫ్ సెక్రటరీ ర్యాండంగ్ గా మీడియాకు విడుదల చేశారు. ఈ పే స్లిప్పులను చూస్తే జీతాలైనా, పెన్షన్లయినా పెరిగినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రతి ఉద్యోగికి సగటున  రు. 8- 15 వేల మధ్య, ప్రతి పెన్షనర్ కు సగటున రు. 8 నుండి 13 వేల మధ్య పెరిగినట్లు తెలుస్తోంది. జీతమైనా, పెన్షనయినా వారి బేసిక్ పే ఆధారంగా పెరుగుతోంది. ఇవే వివరాలను ప్రభుత్వం కోర్టు ముందుంచింది. మరి చివరకు కోర్టు ఏమి చెబుతుందో చూడాలి.

Tags:    

Similar News