ఎంపీగా పవన్‌ అంటే ఫ్యాన్స్‌ ఒప్పుకుంటారా?

Update: 2022-12-30 12:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు అధికారం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. తమ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి.

ఓవైపు 175కి 175 సీట్లు సాధించాలని ఏపీ సీఎం జగన్‌ ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు తలపోస్తున్నారు. ఇంకోవైపు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని.. వైసీపీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం లేదని కుండబద్దలు కొడుతున్నారు.

2014లో పోటీ చేసినట్టే మరోసారి జనసేన, టీ డీపీ, బీజేపీ కలిసి పోటీ చేసేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు ఖాయమనే అభిప్రాయం ఏర్పడుతోంది. బీజేపీని కూడా ఎలాగైనా ఒప్పించి ఎన్నికల నాటికి మూడు పార్టీలు కూటమిగా కలసి పోటీ చేయాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపైన సర్వత్రా ఆసక్తి ఏర్పడుతోంది. పవన్‌ కల్యాణ్‌ గత ఎన్నికల్లో రెండు చోట్ల భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి పవన్‌.. నరసాపురం ఎంపీగా పోటీ చేయొచ్చనే రూమర్‌ షికారు చేస్తోంది. ప్రస్తుతం నరసాపురం ఎంపీగా వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన తరఫున పవన్‌ సోదరుడు నాగబాబు పోటీ చేసిన సంగతి తెలిసిందే.

గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణరాజు కొంతకాలానికే సొంత పార్టీతో విభేదించారు. నిత్యం జగన్‌ ప్రభుత్వంపైన సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ కూడా ఆయనను లోక్‌ సభ సభ్యుడిగా తొలగించాలని ఇప్పటికే స్పీకర్‌ కు విన్నవించింది. అంతేకాకుండా రాజద్రోహం కేసులో అరెస్టు కూడా చేసింది.

మరోవైపు ఈసారి కేంద్రంలో బీజేపీకి గతంలో వచ్చినన్ని సీట్లు రావని చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లోనే దాదాపు 160 సీట్లలో గడ్డు పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీ చేసుకున్న సర్వేలోనే తేలిందని అంటున్నారు. అందువల్ల ఈసారి బీజేపీ ఉత్తరాదిలో పడే బొక్కను దక్షిణాదిలో సీట్లు సాధించడం ద్వారా పూడ్చుకోవాలనే ఉద్దేశంతో ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరితే నరసాపురం నుంచి ఎంపీగా పవన్‌ కల్యాణ్‌ ను పోటీ చేయాలని కోరే అవకాశం ఉందని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. మరోవైపు రఘురామకృష్ణరాజు ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి నరసాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టాక్‌.

నరసాపురంలో ఓవైపు కాపులు, మరోవైపు రాజుల జనాభా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేస్తే పవన్‌ కల్యాణ్‌ (కాపు), ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రఘురామకృష్ణరాజు (రాజు)కు కుల సమీకరణాలు కూడా కలసి వస్తాయని చెబుతున్నారు.

ఇది గాసిప్పే అయినప్పటికీ ఒకవేళ నిజంగా ఇలాగే జరిగితే పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఒప్పుకుంటారా? తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఆశలు పెట్టుకుని తాము ఉంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తే జనసేనతో ఇప్పటిలాగే కలిసి నడుస్తారా అనేది చర్చనీయాంశంగా మారుతోంది.

పవన్‌ కల్యాణ్‌ సీఎంగా ఉంటారంటనేనే కాపు సామాజికవర్గం, ఇతర కులమతాల్లోని పవన్‌ అభిమానులు జనసేనతో కలసి నడిచే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎంపీగా అంటే వారంతా జనసేనతో నడవడం కష్టసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News