ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందా?

Update: 2022-10-17 07:31 GMT
ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై మళ్లీ చర్చలు సాగుతున్నాయి. గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో ఆయనను టీడీపీ కోవర్ట్‌ అని వైసీపీ నేతలు ముద్ర వేశారు. కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తప్పించాక కూడా టీడీపీ కోవర్టుగా ఉండటం వల్లే ఆయనను పదవిలో నుంచి తీసివేశారని వైసీపీ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

కన్నా లక్ష్మీనారాయణ తర్వాత కాపు సామాజికవర్గానికే చెందిన సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. వైసీపీపైన విమర్శలు చేస్తున్నప్పటికీ ఆయనను వైసీపీ కోవర్టుగా ముద్ర వేశారు. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కూడా మూడేళ్లవుతోంది.

ఈ నేపథ్యంలో ఆయనను బీజేపీ అధ్యక్షుడిగా తప్పించి ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని బీజేపీలోనే మరో గ్రూప్‌ ప్రచారం చేస్తోందని అంటున్నారు.

బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ ఇటీవల కాలంలో జగన్‌ ప్రభుత్వం వాడివేడి విమర్శలు చేస్తున్నారు. పదునైన విమర్శలతో జగన్‌ ప్రభుత్వాన్ని ఏకిపడేస్తున్నారు. బీజేపీ అధిష్టానం వద్ద ఈయనకు మంచి పలుకుబడి ఉందని చెబుతున్నారు.

మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మురళీధరన్, కో ఇన్‌చార్జ్‌ సునీల్‌ ధియోధర్‌ల మద్దతు ఉందని అంటున్నారు.

వాస్తవానికి మురళీధరన్‌ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పటికీ ఆయన రాష్ట్రంలో పర్యటించడం చాలా తక్కువగా ఉంది. ఆయన స్థానంలో కో ఇన్‌చార్జ్‌గా ఉన్న సునీల్‌ దియోధరే అన్ని వ్యవహారాలను నడిపిస్తున్నారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఎవరంటే సునీల్‌ పేరే చెప్పేలా ఆయన హవా సాగుతోంది.

ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో వచ్చే 2024 ఎన్నికల వరకు సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉంటారని సునీల్‌ ధియోధర్‌ చెప్పడం గమనార్హం. ఆయన  నాయకత్వంలోనే ఏపీలో ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఆయనను తొలగిస్తే కానీ జనసేన–టీడీపీ–బీజేపీ పొత్తు పొడవదని మరో వర్గం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో సోము వీర్రాజు, సునీల్‌ ధియోధర్, బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వైసీపీకి అనుకూలమని ఓ వర్గం ప్రచారం చేస్తోందని అంటున్నారు. ఈ వర్గానికి సత్యకుమార్‌ రూపంలో ఓ నాయకుడు దొరకడంతో ఆయనను అధ్యక్షుడిగా చేయాలని ఈ వర్గం ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు.

కాగా గతంలో వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబులు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారిపై టీడీపీ కోవర్టులుగా ముద్ర ఉండేది. టీడీపీకి కొమ్ముకాస్తూ బీజేపీని రాష్ట్రంలో ఎదగనీయడం లేదని వారిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఉండేవి.

వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబు తర్వాత బాధ్యతలు చేపట్టినవారిని కూడా ఈ ఆరోపణలు వదలకపోవడం గమనార్హం. వైసీపీని విమర్శిస్తే టీడీపీకి అనుకూలమని.. టీడీపీని విమర్శిస్తే.. వైసీపీకి అనుకూలమని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉండే సత్యకుమార్‌ ఈ మధ్య కాలంలో తరచూ ఏపీని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీపై ఆయన తీవ్ర వాగ్భాణాలు సంధిస్తున్నారు. దీంతో ఆయనకు టీడీపీ కోవర్టు అనే ముద్రను వైసీపీ నేతలు వేసేశారు. ఇలాంటి పరిణామాలతోనే బీజేపీ నేతల ఏపీ రాజకీయం గందరగోళంగా ఉందని అంటున్నారు. ఏ విషయంపైనా స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News