గుర్రు మీదున్న గురువులు.. .జగన్ పాఠాలు అర్ధమవుతాయా....?

Update: 2022-09-05 08:38 GMT
గురువులు అంటే దేవుడితో సమానం అని అంటారు. వారు సమాజానికి చైతన్యం తెచ్చే దిక్సూచికలు. మార్గదర్శకులు. అలాంటి గురువులు ఇపుడు అధికార పార్టీ పట్ల కోపం పెంచుకున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వైసీపీ సర్కార్ పాఠశాలలకు లేట్ గా వస్తే ఒప్పుకోదు, అంతే కాదు ముఖ ఆధారిత అటెండెన్స్ కోసం యాప్ ని ప్రవేశపెట్టింది. దాంతో పాటు సీపీఎస్ రద్దు విషయంలో తేల్చడం లేదు.

ఇక జాతీయ విద్యా విధానం పేరిట ఏపీలోని పాఠశాలలను చాలా వరకూ విలీనం చేయడం వల్ల దూరాభారాలకు మాస్టర్లు వెళ్లాల్సి వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మధ్య దాకా కడుపులో చల్ల కదలకుండా ఉన్న చోటనే గడిపే పంతుళ్ళకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయని భావిస్తున్నారు.  దాంతో వారు ఇది తమను వేధించుకుని తినే సర్కార్ అని మండుతున్నారు.

అయితే గురువులకు ఉపాధ్యాయం దినోత్సవం వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన శైలిలో మెత్తగానే కొన్ని మాటలు చెబుతూ పాఠాలు కూడా చెప్పారు. ఏపీలో విద్యాపరమైన సంస్కరణలకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, పేదవారికి ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యం అని అన్నారు. కార్పోరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ విద్య కూడా అందించాలనుకుంటున్నామని చెప్పారు.

అంతే కాదు తాను విద్యా శాఖ మీద చేసినన్ని సమీక్షలు ఇంతకు ముందు ఏ సర్కార్ చేయలేదని కూడా కుండబద్ధలు కొట్టారు. ఏకంగా విద్యా రంగానికే 55 వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్ తమదని ఆయన చెప్పుకున్నారు. అడగకుండానే పదవీ విరమణ వయసుని తాము పెంచామని, ఇక పెన్షన్ విషయంలో మేలైన విధానాన్నే  తీసుకురావాలన్నదే తమ ఉద్దేశ్యం తప్ప ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టాలని కాదని కూడా చెప్పారు.

అన్నీ అర్ధం చేసుకుని ఉపాధ్యాయులు సహకరించాలని సుతిమెత్తగా పాఠాలు చెప్పారు. గత సర్కార్ సర్కారీ బడులను గాలికి వదిలేసిందని, అలాగే సీపీఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పాలన ముగించిన వారు ఇపుడు తమకు నీతులు చెబుతున్నారని, తమ మీదకు ఉద్యమాలను చేయాలని రెచ్చగొడుతున్నారని టీడీపీ మీద కామెంట్స్ చేశారు.

ఇవన్నీ సరే కానీ ఎందుకో ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. వారు అయితే ఊ అంటావా జగన్ సీపీస్ రద్దుకు ఒహూ అంటావా అని పాటలు కట్టి మరీ పాడి సర్కార్ కి కన్నెర్ర అవుతున్నారు. తమ విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందనే వారు ఈ రోజుకీ భావిస్తున్నారు. ముఖ అధారిత యాప్స్ ని తీసుకురావడం అంటే తమను నమ్మడంలేదని అర్ధమే కదా అని వారు మండిపడుతున్నారు. మొత్తానికి జగన్ చెప్పే పాఠాలు అసలైన  గురువులకు రుచిస్తాయా అర్ధమవుతాయా అంటే ఏమో అన్న జవాబే వస్తుంది మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News