య‌డ్యూర‌ప్ప‌కు మూణ్నాళ్ల ముచ్చ‌టే!

Update: 2021-07-23 07:30 GMT
క‌ర్ణాట‌క బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప మ‌రోసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోయే దిశ‌గా రంగం సిద్ధ‌మైంద‌నే మాటులు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న గ‌ద్దె దిగ‌నున్నార‌నే వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. బీజేపీ అధిష్ఠానం కూడా ఈ నిర్ణ‌యానికే వ‌చ్చింద‌ని, య‌డ్యూర‌ప్ప‌కు ప‌ద‌వి వ‌దులుకోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు అంటున్నాయి. అందుకు ముహూర్తం కూడా ఖ‌రారైంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

నిజానికి య‌డ్యూర‌ప్ప‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి క‌లిసి రాలేద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే మూడు సార్లు క‌ర్ణాట‌క సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆయ‌న ఒక్క‌సారి కూడా పూర్తి కాలం పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌లేదు. అర్ధాంత‌రంగా దిగిపోయారు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న రాజీనామా చేయ‌క త‌ప్పేట్లు లేదు. దీంతో నాలుగో సారి కూడా అధికారాన్ని చేప‌ట్టి ఆ గ‌డువు పూర్తి కాక‌ముందే ప‌ద‌వి నుంచి దిగిపోయిన దుర‌దృష్ట‌వంతుడిగా ఆయ‌న నిలిచిపోనున్నారు. క‌ర్ణాట‌క రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ పంతొమ్మిది సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. కానీ పూర్తి కాలం ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చుంది కొద్దిమంది మాత్ర‌మే. చివ‌ర‌గా కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య అయిదేళ్ల పాటు ప‌ద‌విలో కొన‌సాగారు. య‌డ్యూర‌ప్ప మాత్రం ప‌ద‌వి చేపట్టిన ప్ర‌తిసారి ఏదో ఓ కార‌ణంతో మ‌ధ్య‌లోనే దిగిపోతున్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డం ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ప‌రిపాటి అయిపోయింది.

భార‌తీయ జ‌న‌తా పార్టీ జెండాను ద‌క్షిణాదిన నిలిపిన నాయ‌కుడిగా య‌డ్యూర‌ప్ప‌కు గొప్ప పేరుంది. సామాజిక వ‌ర్గం ప‌రంగా ఆయ‌న బ‌ల‌మైన నేత కావ‌డంతో బీజేపీ ఇక్క‌డ ఉనికిని నిలుపుకోగ‌లిగింది. 2007లో బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వంలో తొలిసారి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ స్వీకారం చేశారు. కానీ కొంత కాలాకినే జేడీఎస్‌ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డంతో య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వం కూలిపోయింది. 2008 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించిన ఆయ‌న మ‌రోసారి సీఎం అయ్యారు. కానీ అక్ర‌మ మైనింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఆయ‌న అధిష్ఠానం ఒత్తిడితో అప్పుడు ప‌ద‌వితో పాటు బీజేపీకి స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేశారు.

క‌ర్ణాట‌క జ‌న‌త ప‌క్ష పేరుతో పార్టీ పెట్టి 2013లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2018 శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి 104 సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన మెజారిటీకి 8 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయిన‌ప్ప‌టికీ త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల‌నే ష‌ర‌తుతో మూడోసారి య‌డ్యూర‌ప్ప సీఎం అయ్యారు. కానీ బ‌లం నిరూపించుకోక‌పోవ‌డంతో కేవ‌లం రెండున్న‌ర రోజుల్లోనే రాజీనామా చేశారు. ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థులు గెల‌వ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బ‌లం సంపాదించిన య‌డ్యూర‌ప్ప నాలుగోసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లతో సొంత పార్టీలోనే అసంతృప్తి పెరిగిపోవడంతో మ‌రోసారి రాజీనామా చేసే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాన్ని శిర‌సావ‌హిస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం వెన‌క రాజీనామా చేసే ఉద్దేశ్య‌మే ఉంద‌ని స్ప‌ష్ట‌మైంది.
Tags:    

Similar News