అక్కా చెల్లెల్ల ఆట హైలెట్టే హైలెట్టు

Update: 2015-07-06 08:46 GMT
పవర్‌ టెన్నిస్‌కు పెట్టింది పేరు విలియమ్స్‌ సిస్టర్స్‌. వీళ్ల రాకతో మహిళల టెన్నిస్‌ ముఖచిత్రమే మారిపోయింది. సున్నితమైన ఆటకు చెల్లుచీటీ ఇచ్చేసి.. మగాళ్లకు దీటుగా టెన్నిస్‌ ఎలా ఆడాలో చూపించారు విలియమ్స్‌ సిస్టర్స్‌. మిగతా క్రీడాకారిణులు కూడా వీళ్లలాగే పవర్‌ టెన్నిస్‌కు అలవాటు పడ్డం మొదలుపెట్టారు. కానీ వీళ్ల పవర్‌ ముందు వాళ్లందరూ తేలిపోతున్నారు. ముఖ్యంగా అక్క వీనస్‌ స్ఫూర్తిగా టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన సెరెనా అంటే ప్రత్యర్థులు బెంబేలెత్తాల్సిందే. కోర్టులో మగరాయుడిలా ఆమె కదిలే తీరు.. కొట్టే షాట్లు ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తాయి. ప్రస్తుతం మహిళల టెన్నిస్‌లో ఆమెను ఎదుర్కొనే సరైన ప్లేయరే లేదు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి.. ఇంకో రెండు టైటిళ్లతో స్టెఫీగ్రాఫ్‌ అ్యతధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును బద్దలు కొట్టడానికి ఉరకలు వేస్తోంది సెరెనా.

వింబుల్డన్‌లో మూడో రౌండ్లో సెరెనాకు.. హెదర్‌ వాట్సన్‌ అనే అమ్మాయి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ మ్యాచ్‌లో ఓటమి కోరల్లోంచి బయటపడి ప్రిక్వార్టర్స్‌ చేరింది సెరెనా. ఐతే సోమవారం ఆమెకు సవాల్‌ ఎదురవుతోంది. తనను టెన్నిస్‌లోకి తెచ్చిన అక్క వీనస్‌నే ఆమె ఎదుర్కోవాల్సి వస్తోంది. మిగతా వాళ్లతో పోటీ పడటం వేరు.. అక్కతో ఆడటం వేరు. తాను కొట్టే షాట్‌ను ఆడలేక అక్క ఇబ్బంది పడుతున్నపుడు సెరెనాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. ఐతే గత కొన్నేళ్లలో అలాంటి మొహమాటాలకు పోకుండా అక్కను చిత్తు చేస్తూ వస్తోంది సెరెనా. అక్కాచెల్లెళ్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడితే.. అందులో సెరెనానే 14 విజయాలతో పైచేయి సాధించింది. కెరీర్‌ ఆరంభంలో వీనసే సెరెనాను ఎక్కువసార్లు ఓడించినా.. ఆ తర్వాత సెరెనా ఆధిపత్యం చలాయిస్తోంది. ఐతే గత ఏడాది ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌లో వీనస్సే గెలిచింది. మరి సోమవారం ఎవరు గెలుస్తారో చూడాలి. ''అభిమానులతో పాటు నేను కూడా అక్కకే మద్దతిస్తా'' అని సెరెనా అంటుంటే.. ''నా మద్దతు మాత్రం సెరెనాకే'' అంటోంది వీనస్‌. మరి కోర్టులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరం.

Tags:    

Similar News