అమ్మ‌కానికి హార్లిక్స్.. కాంప్లాన్..!

Update: 2018-08-18 05:21 GMT
ఉద‌యాన్నే వేడి వేడి టీ.. కాఫీ తాగ‌టం ఎంత మామూలో.. పిల్ల‌ల‌కు పాల‌తో క‌లిపి బ‌ల‌వ‌ర్థ‌మైన మాల్టెట్ డ్రింక్ ఇవ్వ‌టం అంతే అల‌వాటు. బూస్ట్‌.. బోర్న‌వీటా.. హార్లిక్స్...కాంప్లాన్ లాంటి బ్రాండ్లు బోలెడ‌న్ని క‌నిపిస్తాయి. అయితే.. ఈ ప్ర‌ముఖ బ్రాండ్ల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి ఇప్పుడు మార్కెట్ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది.

ఇప్ప‌టికే హార్లిక్స్ బ్రాండ్ అమ్మ‌కానికి జీఎస్‌ కే  (గ్లాక్సో స్మిత్ క్లైన్) రెఢీ అయిన కొద్ది రోజుల‌కే మ‌రో ప్ర‌ముఖ బ్రాండ్ కాంప్లాన్ బ్రాండ్ సైతం సేల్ కు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

కాంప్లాన్ బ్రాండ్ తో పాటు.. హీన్జ్ కు చెందిన గ్లూకోన్ డి.. నైసిల్.. సంప్రితి నెయ్యి బ్రాండ్ల‌ను సైతం ఆ కంపెనీ అమ్మేయాల‌ని భావిస్తోంది.  దీంతో ఈ రెండు బ్రాండ్ల‌ను సొంతం చేసుకోవ‌టానికి దేశీయ‌.. అంత‌ర్జాతీయ కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి.  ఇలా రెండు ప్ర‌ముఖ కంపెనీలు త‌మ బ్రాండ్ల బొకేను అమ్మ‌కానికి పెట్ట‌టం ఇప్పుడు మార్కెట్ వ‌ర్గాల్ని వేడెక్కించేలా చేస్తున్నాయి.

కాంప్లాన్ బ్రాండ్ తో కూడిన క‌న్సూమ‌ర్ ఫుడ్ డివిజ‌న్ ను వంద కోట్ల డాల‌ర్ల‌కు అమ్మ‌కాల‌ని హెన్జ్ భావిస్తోంది. ఇందులో భాగంగా అమ్మ‌కానికి సంబంధించిన వ్య‌వ‌హారాల్ని చూసేందుకు జేపీ మోర్గాన్.. ల‌జార్డ్ సంస్థ‌ల్ని నియ‌మించింది. కంప్లాన్ బాగా పాతుకుపోయిన బ్రాండ్ కావ‌టంతో దాన్ని సొంతం చేసుకోవ‌టానికి ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. త‌మ బిడ్ల‌ను రెఢీ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. మ‌రింత ప్ర‌ముఖ బ్రాండ్ల‌ను స‌ద‌రు కంపెనీలు ఎందుకు వ‌దిలించుకోవాల‌ని భావిస్తున్నాయి?  అన్న‌ది ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి. వాస్త‌వానికి 2015లో క్రాఫ్ట్ ఫుడ్స్.. హీన్జ్ రెండూ విలీన‌మై క్రాఫ్ట్ హెన్జ్ సంస్థ‌గా ఏర్ప‌డ్డాయి. ఈ కంపెనీ మొత్తం 13 భిన్న‌మైన ర‌కాల బ్రాండ్ల అమ్మ‌కాల్ని చేస్తోంది. ఈ కంపెనీ క‌న్సూమ‌ర్ బిజినెస్ 2016-17లో దాదాపు రూ.1800 కోట్ల వ‌ర‌కూ ఉంది. ఇందులో కాంప్లాన్ వాటానే 40 శాతంగా ఉంద‌ని చెబుతారు. మాల్టెడ్ ఫుడ్ డ్రింక్ విభాగంలో కాంప్లాన్ మార్కెట్ వాటా 8 శాతం వ‌ర‌కూ ఉంటుంద‌ని చెబుతారు. ఈ త‌ర‌హా పానీయం మార్కెట్ సైజు మొత్తం రూ.8వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. ఇందులో  44.3 శాతం మార్కెట్ వాటా ఉన్న గ్లాక్సో కంపెనీకి చెందిన హార్లిక్స్ దే అగ్ర తాంబూలం. ఇదే సంస్థ‌కు చెందిన బూస్ట్ కూడా మార్కెట్ లీడ‌ర‌నే చెప్పాలి.

మ‌రి.. అమ్మ‌కాలు భాగున్నా ఎందుకు అమ్ముకోవాల‌నుకుంటున్నాయ‌ని చూస్తే.. ఈ బ్రాండ్ల వృద్ధిరేటు అశించిన స్థాయిలో లేక‌పోవ‌టం.. భ‌విష్య‌త్తు పెద్ద‌గా క‌నిపించ‌క‌పోవ‌టంతో వీటిని వ‌దిలించుకోవాల‌ని భావిస్తున్నాయి స‌ద‌రు కంపెనీలు. మాల్టెడ్ డ్రింక్ విభాగంలో ఆశించినంత పురోగ‌తి లేక‌పోవ‌టం.. వృద్ధి రేటు అంత‌కంత‌కూ త‌గ్గ‌టం కూడా కంపెనీల ఆనాస‌క్తికి కార‌ణంగా చెబుతున్నారు. 2014లో వృద్ది రేటు 13 శాతంగా న‌మోదైతే.. 2017 నాటికి ఇది కాస్తా 9 శాతానికి ప‌రిమిత‌మైంది.

ఎందుకిలా అంటే.. మాల్టెడ్ డ్రింక్స్ కార‌ణంగా క‌లిగే ప్ర‌యోజ‌నం పెద్ద‌గా ఉండ‌ద‌న్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగ‌టం.. వాటిల్లోని పోష‌కాల‌పై నెగిటివ్ కాంపైన్ జ‌ర‌గ‌టం.. వేరుశెన‌గ తొక్కును ప్రాసెస్ చేసి.. ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ ప్యాకింగ్ తో చూడ‌గానే కొనాల‌నిపించేలా త‌యారు చేసి..భారీ ధ‌ర పెట్టి అమ్ముతున్నారంటూ కొన్నేళ్లుగా దుష్ప్ర‌చారం సాగుతోంది. ఇవ‌న్నీ కూడా వీటిపై అనాస‌క్తి పెంచేలా చేస్తున్నాయ‌ని చెప్పాలి. దీనికి తోడు.. వీటి ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరుగుతూ.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవులు సైతం.. కొనాలా?  వ‌ద్దా?  అన్న సందేహానికి గురి చేసేలా ఉండ‌టం కూడా ఒక కార‌ణంగా చెబుతున్నారు. మ‌రి.. అమ్మ‌కానికి వ‌చ్చిన హార్లిక్స్.. కాంప్లాన్ లాంటి బ్రాండ్లు ఎంత‌కు అమ్ముడుపోతాయో చూడాలి.
Tags:    

Similar News