ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గురించి మునుపెన్నడూ వినని వార్త ఇది. పోకిరీలకు అడ్డుకట్టవేయడం సహా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న యోగీ ఈ క్రమంలో దేశం చూపును తనవైపు తిప్పుకొన్న సంగతి తెలిసిందే. యోగీ పరిపాలనకు ఆదిలోనే అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే యూపీలో కూడా అన్ని రాష్ర్టాల్లో వలే సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం డిమాండ్లు కూడా ఉన్నాయి. అలాంటి పరిష్కారం కాని సమస్యలు ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆందోళనలు చేశారు.
ఈ ఆందోళనల్లో భాగంగా ఓ మహిళ కాస్త వినూత్నంగా ఆలోచించింది. యూపీ సీఎం ఫొటోను పక్కన పెట్టుకొని ఓ ఉత్తుత్తి పెళ్లి చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలన్న ఉద్దేశంతో ఇలా నిరసన తెలిపినట్లు పెళ్లి చేసుకున్న మహిళా అంగన్వాడీ కరమ్ చారీ సంఘం జిల్లా అధ్యక్షరాలు నీతూ సింగ్ చెప్పింది! యూపీలోని సీతాపూర్ లో ఈ ఘటన జరిగింది. ఈ పెళ్లి వల్ల రాష్ట్రంలో ఉన్న 4 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని తాము భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ శుక్రవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ సీతాపూర్ కు వస్తున్నారని, ఆయనతో కలిసి తాను లక్నో వెళ్లాలని అనుకుంటున్నట్లు నీతూ చెప్పింది. అయినా తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. తాను ఓ గుర్రంపై వెళ్లి సీఎంను కలుస్తానని ఆమె స్పష్టం చేసింది. ఇంతకుముందే తమ డిమాండ్లను నాలుగు నెలల్లోగా పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అయితే ఎనిమిది నెలలైనా ఏమాత్రం స్పందన లేదని వాళ్లు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.