క్వారంటైన్‌ లో ఆమెదే రికార్డు..26 ఏళ్లు ఇంట్లోనే!

Update: 2020-04-04 03:30 GMT
ప్రస్తుతం కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌ డౌన్‌ తో ప్రజలు ఇంటికి పరిమితమయ్యారు. ఒక విధంగా క్వారంటైన్‌ లో ఉన్నట్టే. అయితే కరోనా బాధితులు మాత్రం 14 రోజులపాటు క్వారెంటైన్‌ లో ఉండాల్సిందే. అంటే ఒక గదికే పరిమితం కావాల్సిందే. బయటకు అడుగు పెట్టవద్దు. ఆ విధంగా నియమనిబంధనలు ఉన్నాయి. దీంతో ఆ క్వారంటైన్‌లో కొందరు ఉండలేక భయపడుతున్నారు. కొందరేమో భయాందోళన చెందుతూ పారిపోతున్న ఘటనలు చూశాం. ఇక కరోనా లక్షణాలు ఉన్నాయంటే 14 రోజులు క్వారంటైన్‌ ఉండాలని వైద్యులు చెబుతారేమోననే భయం ఎంతోమందిలో ఉంది. దాన్ని తప్పించుకునేందుకు రకరకాల వేషాలు వేస్తుంటారు. అయితే మనం 14 రోజులకే ఇంత భయపడుతుంటే ఒక మహిళ ఏకంగా నెలలు కాదు సంవత్సరాలు కాదు ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా క్వారంటైన్‌ కే పరిమితమైంది. క్వారంటైన్‌ లో ఉండి ఆమె చరిత్ర సృష్టించారు. సుదీర్ఘ కాలం పాటు హోం క్వారంటైన్‌ లో ఉండి ఆమె చివరకు క్వారంటైన్‌ లో మృతిచెందడం గమనార్హం. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆసక్తికర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోగాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడెప్పుడు ఏం వచ్చాయి? ఎలాంటి అవస్థలు పడ్డారో పలు సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఈ విషయం బహిర్గతమైంది.
 
నార్త్ ఐర్లాండ్‌ లో 1868లో మేరీ జన్మించింది. అక్కడి నుంచి ఆమె అమెరికాకు వలస వచ్చింది. చిన్నచిన్న పనులు చేస్తూ పొట్ట నింపుకునేది. ఈ క్రమంలో 1900 నుంచి 1915 మధ్యకాలంలో అమెరికాలోని అనేక ఇళ్లల్లో పని చేస్తూ జీవించేది. అయితే ఆమె పనిచేసిన ప్రతి ఇంట్లో కూడా మలేరియా జ్వరం వస్తుండేది. ఎందుకు అనే విషయం మాత్రం తెలియలేదు. ఆమె పని చేసిన ఇళ్లల్లో ప్రతి ఇంట్లో టైఫాయిడ్  బారినపడటం ఆ కుటుంబంలోని వ్యక్తులు మరణిస్తున్నారు. ఆ సమయంలో టైఫాయిడ్ ప్రస్తుతం కరోనా మాదిరి అందరికీ వ్యాపించింది. టైఫాయిడ్‌ వ్యాపించి చాలామంది మరణిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతిచెందిన వారి వివరాలన్నీ తెలుసుకోగా వారి ఇంట్లో పని చేసే అమ్మాయి మేరీ అని గుర్తించారు. ఆమె ద్వారానే జ్వారాలు వ్యాపిస్తున్నాయని గుర్తించి అధికారులు మేరీని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆమెకు ఎన్నో పరీక్షలు చేశారు. అధికారులు అన్ని పరీక్షలు చేయగా చివరకు ఫలితాల్లో ఆమెకు పిత్తాశయంలో టైఫాయిడ్‌ ను వ్యాప్తి చేసే బ్యాక్టీరియా ‘సాల్మొనెల్లా టైఫి’ ఉందని వైద్యులు గుర్తించారు. 1907లో ఆమె శరీరంలో ఆ బ్యాక్టీరియా ఉండటంతో ఆమెను మూడేళ్లపాటు క్వారెంటైన్‌ లో ఉంచారు. ఆ తరువాత ఆమెను విడుదల చేశారు. వచ్చిన అనంతరం మళ్లీ యథావిధిగా ఆమె ఇళ్లల్లో పనికి కుదిరింది. కొన్ని రోజులపాటు చాకలిగా పని చేయగా ఆదాయం సరిపోకపోవడంతో వంట మనిషిగా పని చేసింది. పని చేస్తున్న క్రమంలో ఆ బ్యాక్టీరియా బయటకు వచ్చి ఇతరులకు వ్యాపించడం మొదలైంది. అనేకమందికి ఆ బ్యాక్టీరియా సోకడంతో ఎంతోమంది టైఫాయిడ్‌ తో బాధపడుతూ మృతిచెందిన సంఘటనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అధికారులు స్పందించి ఆమెను తిరిగి క్వారెంటైన్‌కు తరలించారు. ఆమె వలన బ్యాక్టీరియా వ్యాప్తి చెంది దేశంలో టైఫాయిడ్‌ విజృంభించే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు ఆమెను క్వారంటైన్‌ లో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ల్యాబ్‌ లో క్వారంటైన్‌ విధించగా ఖాళీగా ఉండకుండా మేరీ అక్కడ కూడా పని చేస్తూ ఉండేది. అలా పని చేస్తున్న సమయంలో ఆమెకు పక్షవాతం సోకింది. దీంతో ఆరేళ్ల పాటు మంచం మీదనే ఉండిపోయింది. చివరకు ఆమె పక్షవాతంతో బాధపడుతూ ఆ మంచం పైనే 1938 - నవంబర్ 11వ తేదీన మేరీ మరణించింది. దాదాపు 26 ఏళ్లపాటు క్వారంటైన్ లో ఉన్న మహిళగా ఆమె చరిత్రకు ఎక్కింది.

కరోనా బాధితులు 14 రోజులు క్వారంటైన్‌ లో ఉండలేని వారు మేరీ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. మీ నుంచి ఇతరులకు కరోనా వైరస్‌ వ్యాపించొద్దని విషయంతో పాటు ఆ వైరస్‌ నుంచి కోలుకునేందుకు సత్వర వైద్యం అందించేందుకు క్వారంటైన్‌ విధిస్తారు. అది గ్రహించకుండా క్వారంటైన్‌ అంటే భయపడడం కాదు. క్వారంటైన్‌ కు సహకరిస్తే మీకు - సమాజానికి కూడా ఎంతో మేలు చేసిన వారవుతారు. ఈ విషయం అందరూ గుర్తించాలి.
Tags:    

Similar News