హర్యానా ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ రెజ్లర్

Update: 2019-09-12 07:35 GMT
సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసిందో లేదో.. హర్యానా.. ఢిల్లీ అసెంబ్లీలకు ఎన్నికల గంట మోగేందుకు టైం దగ్గరకు వచ్చేసింది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే హర్యానాలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఎన్నికల ప్రచారాన్ని ముందే మొదలెట్టేశారని చెప్పాలి.

ప్రస్తుతం బీజేపీ ఏలుబడిలో ఉన్న హర్యానాలో.. మరోసారి విజయాన్ని సొంతం చేసుకునే దిశగా మోడీషాలు పావులు కదుపుతున్నారు. ఊహించని రీతిలో ప్రముఖ మహిళా రెజ్లర్ బబితా ఫోగాట్ ను ఎన్నికల బరిలోకి దించే దిశగా బీజేపీ పావులు కదపటం.. అందుకు ఆమె ఓకే చెప్పేయటం జరిగాయి.

స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఫోగాట్ .. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల హర్యానా ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదించింది. అయితే.. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఫోగాట్.. ప్రభుత్వం ఆమోదం పొందకుండానే పార్టీలో చేరిన కారణంగా ఆమె నుంచి రెండు నెలల జీతాన్ని పరిహారంగా వసూలు చేయటం గమనార్హం.

ఆగస్టు 13న తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ఫోగట్ నిర్ణయం తీసుకొని.. పత్రాల్ని ప్రభుత్వానికి పంపితే.. ఈ నెల పదిన ఆమె రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఫోగాట్ తో పాటు ఆమె తండ్రి మహావీర్ ఫోగాట్ కూడా బీజేపీలో చేరారు. కేంద్ర క్రీడా శాఖామంత్రి కిరణ్ రిజుజు సమక్షంలో వారు పార్టీలో చేరారు. త్వరలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బర్దా లేదంటే చారకీ దాద్రి అసెంబ్లీ స్థానాల నుంచి బబితా ఫోగట్ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News