బస్సు డ్రైవర్ నిద్రమత్తుతో 10 మంది బలి

Update: 2016-08-22 04:11 GMT
దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పది నిండు ప్రాణాలు బలి కాగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్ని ఉలిక్కిపడేలా చేసింది.  హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళుతున్న యాత్రాజినీ బస్సు ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని మియాపూర్ నుంచి కాకినాడకు వెళ్లే  ప్రైవేటు బస్సు ఆదివారం రాత్రి బయలుదేరింది. హైదరాబాద్ నగర శివార్లు దాటిన కొద్ది గంటలకే ఘోర ప్రమాదానికి గురైంది.

సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల వేళ.. నాయకన్ గూడెం వద్దకు చేరకున్న వేళ.. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు నాగార్జున సాగర్ ఎడమకాలువ వంతెన పై నుంచి కిందకు పడింది. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి బస్సు పడిపోవటంతో బస్సులోని ప్రయాణికుల్లో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలకు గురైన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది తూర్పు.. పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారే ఉన్నారు.

మితిమీరిన వేగంతో పాటు.. డ్రైవర్ నిర్లక్ష్యం.. నిద్రమత్తుతో సడన్ బ్రేక్ వేయటం ఈ దారుణ  ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారీ కాగా.. బస్సులో చిక్కుకుపోయిన వారిని అక్కడి స్థానికులు బయటకు తీశారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనాస్థలం నుంచి మూడు అంబులెన్స్ లలో ప్రయాణికుల్ని ఆసుపత్రికి తరలించారు.  

కాలువలో పడిన బస్సును రెండు పెద్ద క్రేన్ల సాయంతో బయటకు తీశారు. ఈ దారుణ రోడ్డు ప్రమాదంపై ఏపీ..తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరూ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రమాదంపై సమీక్షించి బాధితులకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మృతుల కుటంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని.. బాధిత కుటుంబాలకు సమాచారం అందజేసి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు.. పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి బాధిత కుటుంబాల వివరాలు తెలుసుకొని.. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు.
Tags:    

Similar News