వర్షాకాలం మీట్ : ఈసారి స్పెషల్ ఏంటి...?

Update: 2022-06-07 00:30 GMT
త్వరలో వర్షాకాల శాసనసభ సమావేశాల నిర్వహణకు వైసీపీ సర్కార్ సమాయత్తమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్  తో  జరిగిన తాజా భేటీ సందర్భంగా తెలియచేశారు అంటున్నారు.  వైసీపీ సర్కార్ లో కొత్త మంత్రులు కొలువు తీరిన తరువాత జరిగే మొదటి అసెంబ్లీ సమావేశాలు ఇవే కావడం విశేషం. ఇక ఈ సమావేశాలలో కీలకమైన బిల్లులు ప్రవేశపెడతారు అంటున్నారు.  

ఇక ఈ బిల్లులలో మూడు రాజధానులకు సంబంధించినది ఉంటుందా అన్నదే ఆసక్తికరమైన చర్చగా ఉంది. ఆ మధ్యన మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆగస్ట్ తరువాత ఏపీలో కీలకమైన రాజకీయ పరిణామాలు సంభవిస్తాయని హింట్ ఇచ్చిన సంగతి విధితమే. అది కూడా ఆయన కర్నూల్ వెళ్ళి అక్కడ మాట్లాడారు, న్యాయ రాజధానిగా కర్నూల్ అయ్యే వీలు ఉందని కూడా నర్మగర్భంగా చెప్పుకొచ్చారు.

దాంతో వర్షాకాల సమావేశాలలో దీనికి సంబంధించి సమగ్రమైన బిల్లు ఒకటి అసెంబ్లీ ముందుకు రావడం ఖాయమని అంటున్నారు. ఒక విధంగా అదే జరిగితే రాజకీయ ప్రకంపనలు రేగడం ఖాయం. జగన్ సైతం ఇటీవల జిల్లాలలో నిర్వహించిన సభలలో మాట్లాడుతూ మీరు అంటున్న అమరావతి రాజధాని అని ప్రత్యర్ది పార్టీ టీడీపీని ఉద్దేశించి  చెబుతూ సెటైర్లు వేస్తూ వస్తున్నారే కానీ మన రాజధాని అమరావతి  అని మాత్రం ఎక్కడా కనీసమైనా అనడంలేదు.

దాంతో ఆయనకు అమరావతి విషయంలో ఇంకా పాత వైఖరి అలాగే ఉందని అర్ధమవుతోంది అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తు చేసుకోవాలి. జగన్ ఒకసారి ఫిక్స్ అయితే కాస్తా ఆగుతారే తప్ప అమలు చేయకుండా ఉండరని అంటారు. ఇపుడు మూడు రాజధానుల  విషయంలో ఏదో రూపంలో ఆయన  తన మాట నెగ్గించుకునేందుకే చూస్తారని అంతున్నారు.

మొత్తానికి చూస్తే ఈసారి వర్షాకాల సమావేశాలు కూల్ గా జరిగే అవకాశాలు అయితే లేవు. చంద్రబాబు సభకు రాకపోయినా ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వస్తారు. వారు కచ్చితంగా అమరావతి విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించి తీరుతారు అది రచ్చ అవుతుంది. అలాగే ఇవే సమావేశాలలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని  మరికొన్ని కీలకమైన నిర్ణయాలు రాజకీయ సామాజిక పరమైనవి తీసుకోవాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇక ఈసారి జరిగే  వర్షాకాల సమావేశాలు మొక్కుబడిగా కాకుండా ప్రత్యేక ఫోకస్ తో జరుగుతాయని అంటున్నారు. దీని తరువాత జరిగే శీతాకాల సమావేశాలలోగా ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా పూర్తిగా మారుతాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో రైనీ సీజన్ మీద వైసీపీ గురి పెట్టింది.

అందుకే తొందరలోనే  వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తామని గవర్నర్ ని తాజాగా కలసిన జగన్ సూచనాప్రాయంగా వివరించారు అంటున్నారు. మొత్తానికి చూస్తే ప్లీనరీకి ముందే వీలైతే ఈ నెలాఖరులోగా  సమావేశాలు నిర్వహించి అక్కడ ఆమోదించిన బిల్లులను  ప్లీనరీలో గొప్పగా చెప్పుకుని ఆ మీదట జనాలలో ప్రచారం చేసుకోవడానికి  వైసీపీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అని తోస్తోంది.
Tags:    

Similar News