జ‌గ‌న్ మీటింగ్‌.. హా ఏం వెళ్తాంలే అంటోన్న క్యాడ‌ర్‌!

Update: 2021-10-08 06:41 GMT
దివంగ‌త ముఖ్య‌మంత్రి మాహానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వారసుడిగా రాజ‌కీయాల్లో అడుగుపెట్టి ఎన్నో ఒడుదొడుకులు దాటి ప్ర‌జ‌ల అభిమానాన్ని సంపాదించుకుని 2019 ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా తొలిసారి జ‌గ‌న్ కూర్చీలో కూర్చున్నారు. మంచి వాగ్ధాటితో ఉత్త‌మ ప్ర‌ణాళిక‌ల‌తో మెరుగైన వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేసిన ఆయ‌న ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ సంపాదించుకోవ‌డ‌మే కాకుండా వైసీపీ క్యాడ‌ర్‌లోనూ పూర్తి ఉత్సాహాన్ని నింపారు. కానీ ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి చేప‌ట్టి రెండున్న‌రేళ్లు కావొస్తున్న నేప‌థ్యంలో క్యాడ‌ర్‌లో ముందున్న ఉత్సాహం.. జ‌గ‌న్‌పై అభిమానం త‌గ్గుతుంద‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

గ‌తంలో 2009 నుంచి 2019 ఎన్నిక‌ల వ‌ర‌కూ జ‌గ‌న్ పేరు వింటే చాలు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు పూన‌కం వ‌చ్చేది. ఆయ‌న మాటలు కానీ ఫొటోలు కానీ వీడియోలు కానీ క్యాడ‌ర్‌కు ఊపు తెచ్చేవి. వైఎస్సార్ మ‌ర‌ణానంతరం పార్టీ పెట్టి ఓదార్పు యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన ఆయ‌న బాగానే జ‌నాల మ‌ద్ద‌తు సంపాదించ‌గ‌లిగారు. ఇక వైఎస్సార్‌పై అభిమానం జ‌గ‌న్‌పై ప్రేమ ఉన్న కార్య‌క‌ర్త‌లు క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లోపేతం కోసం ఎంతో కృషి చేశారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ బీజేపీ జ‌న‌సేన కూట‌మిగా ఏర్ప‌డి మ‌రీ వైసీపీని ఓడించాయి. అప్పుడు కొత్త‌ పార్టీ వైసీపీ త‌ర‌పున పోటీ చేసి 67 మంది ఎమ్మెల్యేలు నెగ్గారు కానీ టీడీపీకి వైసీపీకి మ‌ధ్య అప్పుడు కేవ‌లం 1.2 శాతం మాత్ర‌మే తేడా వ‌చ్చింది. దీంతో ఇంకాస్త క‌ష్ట‌ప‌డితే వచ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని న‌మ్మిన క్యాడ‌ర్ 2019 వ‌ర‌కూ అదే ఊపు కొన‌సాగించింది.

2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌డం.. వివిధ కేసుల్లో జైలుకు వెళ్ల‌డం.. ఇలా ప్ర‌జ‌ల్లో సానుభూతితో పాటు గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ విజ‌యం కోసం పార్టీ శ్రేణులు క్షేత్ర‌స్థాయ‌లో ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాయి. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఘ‌న విజ‌యం సాధించారు. కానీ ఆ గెలుపు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఖాతాలోకి వెళ్లిన‌ప్ప‌టికీ వైసీపీ కార్య‌క‌ర్త‌ల క‌ష్టాన్ని త‌క్కువ చేసి చూడ‌డానికి లేదు. కానీ ఆ త‌ర్వాత క్ర‌మంగా క్యాడ‌ర్‌లో జోష్ త‌గ్గుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సీఎం అయ్యాక జ‌గ‌న్ చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల నేరుగా ప్ర‌జ‌ల‌కు చేరుతున్నాయి. అందుకు వాలంటీర్ల వ్య‌వ‌స్థ దోహ‌ద‌ప‌డుతోంది. అంతే కాకుండా ఇక క‌రోనా స‌మ‌యంలో సంక్షేమ ప‌థ‌కాలు ప్రారంభించిన జ‌గ‌న్ వాటి ప్రారంభోత్స‌వానికి ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేదు. కానీ తాజాగా డ్వాక్రా గ్రూపు సంఘాల రుణ‌మాఫీ కోసం రెండో విడ‌త వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కాన్ని ఒంగోలులో జ‌గ‌న్ త‌న చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ వ‌చ్చినా కార్య‌క‌ర్తల్లో మాత్రం ఊపు క‌నిపించ‌లేదు. మునుప‌టి జోష్ క‌నిపించ‌లేద‌ని తెలిసింది.

జ‌గ‌న్ కార్య‌క్ర‌మానికి ఏం వెళ్తాంలే అన్న భావన గ్రామాల్లోని కార్య‌క‌ర్త‌ల్లో క‌నిపించిన‌ట్లు స‌మాచారం. మ‌న‌కు ఏం వొరిగింద‌ని ఈ కార్య‌క్ర‌మానికి వెళ్తామ‌ని కార్య‌క‌ర్త‌లు అనుకున్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుత రాజ‌కీయం నేప‌థ్యంలో గ్రామాల్లో త‌మ‌కు విలువ లేద‌ని వైసీపీ గ్రామ నాయ‌కులు అనుకుంటున్న‌ట్లు తెలిసింది. ప‌థ‌కాల ఫ‌లితాలు నేరుగా ప్ర‌జ‌ల ఖాతాల్లోకి చేరుతున్నాయ‌ని ఇక తాము ఏం చేయాల‌నే భావ‌న‌లో గ్రామాల్లోని వైసీపీ స‌ర్పంచులు వార్డు మెంబ‌ర్ల నుంచి బూత్ క‌మిటీ నాయ‌కుల వ‌ర‌కూ ఇదే టాక్‌. ఒంగోలు మీటింగ్‌లో దాదాపు 99 శాతం వైసీపీ క్యాడ‌ర్ పాల్గొన‌లేదంటే పార్టీ మీద వాళ్లు ఎంత గుర్రుగా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చ‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. ఈ మీటింగ్ త‌ర్వాత ప్ర‌కాశం జిల్లాలో ఎక్క‌డ చూసిన ఇదే చ‌ర్చ సాగింది. ఈ కార్య‌క్ర‌మానికి వెళ్తే కార్ల‌కు డిజీల్ ఎవ‌రు పోస్తారు? అక్క‌డి వెళ్లాక ఎవ‌రు ప‌ల‌క‌రిస్తారు? అని కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య చ‌ర్చ సాగిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఒంగోలు మీటింగ్‌తో పార్టీపై వైసీపీ కార్య‌క‌ర్త‌ల అసంతృప్తి వెలుగులోకి వ‌చ్చింది. జ‌గ‌న్ ఇక జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో దీని ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.





Tags:    

Similar News