రాజ్యసభలో రైతు బిల్లులకు వైసీపీ - జేడీయూ మద్దతు

Update: 2020-09-20 09:30 GMT
వ్యవసాయ సంబంధ బిల్లులను సంబంధిత మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆదివారం ఉదయం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇదివరకే పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుతో ప్రయోజనమే కాని నష్టం లేదని నరేంద్రసింగ్‌ తెలిపారు. అలాగే రైతులు తమ ఉత్పత్తులను దళారులకు అమ్ముకోకుండా స్వేచ్ఛగా బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చని దీంతో తమకు కమీషన్ల బెడద లేకుండా అనుకున్న లాభాలు వస్తాయని పేర్కొన్నారు. విపక్షాలు ఈ బిల్లుపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మరోవైపు రైతుల గొంతుకోసేలా కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉన్నాయని ఓవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. వివిధ పార్టీలు, రైతులు, సంఘాలు ఆందోళన బాటపట్టాయి. పలురాష్ట్రాల సీఎంలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నిరసనలకు కేంద్రంగా ఉన్న పంజాబ్, హర్యానాలో అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు.

ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, జేడీయూ సమర్థించడం గమనార్హం. ఇతర విపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని..కాంగ్రెస్ మధ్యదళారుల పార్టీ అని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అభ్యంతరం తెలిపారు. విజయాసాయి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు డీఎంకే, టీఆర్ఎస్ కూడా ఈ బిల్లుల పట్ల వ్యతిరేకత ప్రకటించాయి. కార్పొరేట్ సంస్థలకు బానిసగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Tags:    

Similar News